పారిశ్రామిక దిశగా..
ABN , Publish Date - Dec 29 , 2025 | 12:26 AM
జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తున్నది. విశాఖపట్నంలో ఇటీవల నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో (సీఐఐ ఇన్వెస్ట్‌ర్స్ మీట్) జిల్లాలో 11 పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఆయా కంపెనీల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు.
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
సీఐఐ ఇన్వెస్టర్స్ మీట్‌లో 11 కంపెనీలతో ఒప్పందాలు
నక్కపల్లి మండలంలో బొమ్మల తయారీ పార్కు
రాంబిల్లి మండలంలో రిలయన్స్ సాఫ్ట్ డ్రింక్స్, జ్యూస్ ప్లాంట్
ఇదే మండలంలో సోలార్ పరికరాల తయారీ పరిశ్రమరాక
నక్కపల్లి మండలంలో ప్రైవేటు స్టీల్ ప్లాంట్‌కు మౌలిక వసతుల పనులు
అచ్యుతాపురం మండలంలో ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పవర్ ప్రాజెక్టు
ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కు
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తున్నది. విశాఖపట్నంలో ఇటీవల నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో (సీఐఐ ఇన్వెస్ట్‌ర్స్ మీట్) జిల్లాలో 11 పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఆయా కంపెనీల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు. ప్రతి అసెంబ్లీ నియోకవర్గానికి ఒకటి చొప్పున ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో అధికారులు స్థలాలను ఎంపికచేస్తున్నారు. మరోవైపు నక్కపల్లి మండలంలో బల్క్‌డ్రగ్ పార్కు పనులు, ప్రైవేటు స్టీల్ ప్లాంట్‌కు కేటాయించిన కారిడార్ భూముల్లో మౌలిక సదుపాయాల పనులు వేగంగా సాగుతున్నాయి.
జిల్లాలోని ఎలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లో రానున్న కాలంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. అచ్యుతాపురం మండలంలో ఇప్పటికే ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ప్రాజెక్టు పనులు ఇప్పటికే మొదలయ్యాయి. నక్కపల్లి మండలంలో ప్రైవేటు రంగంలో ‘ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్స్’ కంపెనీలు సంయుక్తంగా ఒక లక్షా 47 వేల కోట్ల రూపాయలతో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కంపెనీ మొదటి దశ పనులకు అవసరమైన భూమిని ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. ఈ భూముల్లో మౌలిక వసతుల కల్పన పనులు జరుగుతున్నాయి. ఇదే మండలంలో బల్క్‌డ్రగ్ పార్కు ఏర్పాటు పనులు కూడా మొదలయ్యాయి. నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు రెండు కంపెనీలు ముందుకురాగా.. ప్రభుత్వం భూములు కేటాయించింది. ఎర్త్ మూవర్స్ యంత్రాలు, విడిభాగాలను తయారుచేసే ‘డోజ్కో’ కంపెనీ ఏర్పాటుకు గత నెలలో శంకుస్థాపన కూడా జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ ఏర్పాటుకు ఒక ప్రైవేటు సంస్థ ముందుకు వచ్చింది.
నక్కపల్లి మండలంలో గ్లోబల్ టాయ్స్ తయారీ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం 581.39 ఎకరాలు కేటాయించింది. ఇందులో 497.43 ఎకరాలు ఉపమాకలో, 83.78 ఎకరాలు సీహెచ్ లక్ష్మీపురంలో వున్నాయి. ఈ మేరకు నవంబరు మూడో వారంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వు జారీ చేశారు.
పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అనకాపల్లి జిల్లాలో సాఫ్ట్ డ్రింక్స్, జ్యూస్‌లు, ప్యాకేజింగ్ డ్రింకింగ్ వాటర్ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎకరా రూ.40 లక్షల చొప్పున రాంబిల్లి మండలం కృష్ణంపాలెంలో 30 ఎకరాలు కేటాయించింది. ఈ పరిశ్రమపై రూ.784 కోట్లు వెచ్చించనున్నట్టు రిలయన్స్ గ్రూపు వెల్లడించింది.
‘రెన్యూ ఎనర్జీ గ్లోబల్ పీఎల్‌సీ’ అనే సంస్థ రూ.3,999 కోట్లతో రాంబిల్లిలో ఇంటిగ్రేటెడ్ సోలార్ ఇన్‌గాట్ అండ్ వేఫర్ తయారీ ప్లాంటు ఏర్పాటుకు ముందుకువచ్చింది. ఆరు గిగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటుచేసే ఈ ప్లాంటు కోసం రాంబిల్లి మండలంలో ప్రభుత్వం భూమిని కేటాయించింది. వచ్చే ఏడాది మార్చినాటికి పనులు ప్రారంభించి 2028 జనవరినాటికి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభిస్తుంది.
నియోజకవర్గానికి ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు
యువత ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వలస పోకుండా స్థానికంగానే ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందేలా కూటమి ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) పార్కుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రతి నియోజకవర్గంలో సుమారు 100 ఎకరాల్లో ఈ పార్కులను అభివృద్ధి చేయాలని ఆదేశించడంతో ఇందుకు అవసరమైన భూములను జిల్లా అధికారులు సేకరిస్తున్నారు. అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి అనకాపల్లి మండలం కోడూరులో 70 ఎకరాల విస్తీర్ణంలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఎంఎస్‌ఎంఈ పార్కు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, వీధిదీపాలు, నీటివసతి కల్పించేందుకు రూ.6 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. ఇక్కడ సుమారు 250 పరిశ్రమలను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం కాగా ఇప్పటికే 180 మందికిపైగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం వీరికి ప్లాట్‌లను కేటాయించారు. ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో ఇప్పటికే ఉన్న ఏపీఐఐసీ సెజ్ భూమిలో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంపెక్స్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ప్రతి బ్లాక్‌లో ఒక్కొక్కటి 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు బ్లాకుల్లో సుమారు 80 కాంప్లెక్స్‌లు నిర్మించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పారిశ్రామిక వేత్తలకు ఇక్కడ ప్లాట్‌లను కేటాయిస్తున్నారు. పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని పరవాడలో ఏపీఐఐసీ సెజ్ ఫేజ్-2లో భాగంగా ఎంఎస్‌ఎంఈ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం రాచపల్లి రెవెన్యూలో ఏపీఐఐసీకి చెందిన భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు గత నెలలో శంకుస్థాపన చేశారు. చోడవరం నియోజకవర్గం బుచ్చెయ్యపేట మండలంలో స్థలాన్ని గుర్తించారు. ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడు మండలం ఆర్లి, చింతలపాలం, గుల్లేపల్లి గ్రామాల్లో భూములను గుర్తించారు.