సారా రహిత దిశగా..
ABN , Publish Date - May 28 , 2025 | 12:31 AM
నాటుసారాను అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన నవోదయం-2.0 సత్ఫలితాలు ఇస్తున్నది. ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది సారా తయారీ బట్టీలు వున్న ప్రాంతాలు, రవాణా మార్గాలు, విక్రస్తున్న గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టారు.
జిల్లాలో సత్ఫలితాలు ఇస్తున్న నవోదయం 2.0
151 గ్రామాల్లో నాటుసారా ప్రభావం
ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజన
విస్తతంగా దాడులు, తనిఖీలు నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు
గ్రామాల్లో అవగాహన సదస్సులు
పాత నేరస్థుల బైండోవర్
147 గ్రామాల్లో సారా తయారీ, విక్రయాలు బంద్
మిగిలిన పాయకరావుపేట, లోవ గవరవరం, కొండలపాలెం, మేడివాడలపై ప్రత్యేక దృష్టి
త్వరలో సారా రహిత జిల్లాగా ప్రకటించే అవకాశం
నర్సీపట్నం, మే 27 (ఆంధ్రజ్యోతి): నాటుసారాను అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన నవోదయం-2.0 సత్ఫలితాలు ఇస్తున్నది. ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది సారా తయారీ బట్టీలు వున్న ప్రాంతాలు, రవాణా మార్గాలు, విక్రస్తున్న గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. సారా కేసులకు సంబంధించి పాత నేరస్థులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ చేస్తున్నారు. జిల్లాలో గుర్తించిన 151 గ్రామాలను సారా రహితంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 147 గ్రామాల్లో సారా తయారీ, రవాణా, విక్రయాలు, ఆపేస్తూ గ్రామ కమిటీలు తీర్మానాలు చేశాయి. తరువాత డిప్యూటీ కమిషనర్ స్థాయిలో విశాఖపట్నం ఎన్‌ఫోర్స్‌మెంట్, అసిస్టెంట్ కమిషనర్ స్థాయిలో అనకాపల్లి ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో టాస్క్ ఫోర్స్ బృందాలు ఆయా గ్రామాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేసి తుది నివేదిక ఇస్తారు. దీని ఆధారంగా అనకాపల్లిని నాటుసారారహిత జిల్లాగా ప్రకటిస్తారు.
నాటు సారా నిర్మూలనకు ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 19న నవోదయం-2.0 కార్యక్రమాన్ని ప్రారంభించింది. నర్సీపట్నం, గొలుగొండ, వి.మాడుగుల, చోడవరం, పాయకరావుపేట, ఎలమంచిలి, సబ్బవరం, అనకాపల్లి ఎక్సైజ్ స్టేషన్‌ల పరిధిలో 151 గ్రామాల్లో నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలు జరుగుతున్నట్టు గుర్తించారు. సారా తయారు చేస్తున్న గ్రామాలను ఏ కేటగిరీలో, సారా తయారీ, అమ్మకాలు చేస్తున్న గ్రామాలను బీ కేటగిరీలో, సారా విక్రయిస్తున్న గ్రామాలను సీ కేటగిరీలో పెట్టారు. ఏ కేటగిరీలో 21 గ్రామాలు, బీబి కేటగిరీలో 45 గ్రామాలు, సీ కేటగిరీలో 85 గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో సారా నిర్మూలనకు ప్రత్యేకంగా గ్రామ/ మండల కమిటీలను ఏర్పాటు చేశారు. గ్రామ కమిటీలో పంచాతీయ సర్పంచ్, వీఆర్‌వో, పంచాయతీ కార్యదర్శి, ఎక్సైజ్ ఎస్‌ఐ ఉన్నారు. మండల కమిటీలో తహసీల్దార్, పోలీస్ శాఖ నుంచి ఎస్‌ఐ, ఎక్సైజ్ శాఖ నుంచి ఎస్‌హెచ్‌ఓ ఉన్నారు.
పాత నేరస్థులకు కౌన్సెలింగ్
సారా తయారీ, రవాణా, అమ్మకం చేస్తూ పట్టుబడిన వారు, గతంలో శిక్ష లేదా జరిమానా పడిన పాత నేరస్థులను స్టేషన్‌కు పిలిపించి ఎక్సైజ్ అధికారులు కౌన్సెలింగ్ చేస్తున్నారు. 771 మంది పాత నేరస్థులను లక్ష రూపాయల పూచీకత్తుతో తహసీల్దార్ల వద్ద బైండోవర్ చేశారు. దీంతో ఏ కేటగిరిలో 17 గ్రామాలు, మిగిలిన రెండు కేటగిరీల్లో అన్ని గ్రామాలు (147) సారా రహితంగా గుర్తించారు. ఏ కేటగిరీలో వున్న పాయకరావుపేట, వి.మాడుగుల మండలం లోవ గవరవరం, కొండలపాలెం, రావికమతం మండలం మేడివాడ గ్రామాలను సారా రహితంగా ప్రకటించాల్సి ఉంది. సారా రహితంగా గుర్తించిన గ్రామాల్లో గ్రామ కమిటీల ఆమోదం తీసుకున్నారు. మండల కమిటీల తీర్మానాలు కూడా దాదాపు పూర్తి చేశారు.
16 నెలలో 4,185 లీటర్ల సారా స్వాధీనం
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది జిల్లాలో నాటుసారా బట్టీలపై విస్తృతంగా దాడులు నిర్వహించారు. గత ఏడాది జనవరి నుంచి డిసెంబరు వరకు 1,083 కేసులు నమోదు చేసి 1,974.5 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. 5,84,120 లీటర్ల బెల్లం పులుసును ధ్వసం చేశారు. 236 మందిని అరెస్టు చేసి ఎనిమిది వాహనాలను సీజ్ చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు 363 కేసులు నమోదు చేసి 275 మందిని అరెస్టు చేశారు. 2,211 లీటర్ల సారాను స్వాధీనం చేసుకొన్నారు. 96,650 లీటర్ల బెల్లం పులుసును ధ్వంసం చేశారు. 15 వాహనాలు, 7,724 కిలోల నల్ల బెల్లం సీజ్ చేశారు. మే నెలలో నాలుగు కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. సారా రహిత గ్రామాలుగా ప్రకటించిన తర్వాత ఆయా గ్రామాల్లో కేసులు నమోదు కాలేదు.
నాటు సారా తయారీ, రవాణా, అమ్మకాలను నిరోధించడానికి ప్రభుత్వం ప్రత్యేంగా టోల్ ఫ్రీ నంబర్ (14405) ప్రకటించిందని, గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడైనా సారా విక్రయించినా, తయారు చేసినా, రవాణా చేసినా సమాచారం ఇవ్వాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాక అసిస్టెంట్ కమిషనర్ సుర్జిత్‌సింగ్ కోరారు.