పర్యాటకుల కోలాహలం
ABN , Publish Date - Dec 07 , 2025 | 12:02 AM
మన్యంలో శనివారం పర్యాటకుల సందడి నెలకొంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో పాటు ప్రకృతి అందాలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుండడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు.
సందర్శనీయ ప్రాంతాలు కిటకిట
పాడే రు, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): మన్యంలో శనివారం పర్యాటకుల సందడి నెలకొంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో పాటు ప్రకృతి అందాలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుండడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు పర్యాటక సందడి నెలకొంది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, డుంబ్రిగుడలో చాపరాయి జలవిహారి, పాడేరు మండలంలో వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్, చెరువువేనం మేఘాలకొండ, లంబసింగి ప్రాంతాలకు అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు.
వంజంగి మేఘాల కొండపై..
పాడేరు రూరల్: ప్రముఖ పర్యాటక కేంద్రం వంజంగి మేఘాల కొండకు శనివారం పర్యాటకులు పోటెత్తారు. వంజంగి సందర్శనకు వచ్చే పర్యాటకులు ముందు రోజు రాత్రి పాడేరు, వంజంగిలో రాత్రి బస చేసి ఫైర్ క్యాంప్‌లు, గిరిజన సంప్రదాయ థింసా నృత్యాలతో ఆనందంగా గడుపుతున్నారు. శనివారం వంజంగి మేఘాల కొండను 2,000 మంది సందర్శించగా, రూ.1,12,490 ఆదాయం వచ్చిందని ఎకో టూరిజం నిర్వాహకులు తెలిపారు.
కొత్తపల్లి జలపాతం వద్ద..
జి.మాడుగుల: మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కొత్తపల్లి జలపాతం వద్ద శనివారం పర్యాటకులు సందడి చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్సాహంగా గడిపారు. స్నానాలు చేస్తూ సెల్ఫీలు దిగారు.