పోటెత్తిన పర్యాటకులు
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:09 AM
పర్యాటకులతో గురువారం నగరం పోటెత్తింది.
కిక్కిరిసిన రహదారులు
ఆర్కే బీచ్‌రోడ్డు సహా పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్
విశాఖపట్నం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి):
పర్యాటకులతో గురువారం నగరం పోటెత్తింది. ఇది పర్యాటకులు అధికంగా వచ్చే సీజన్. ఏడాది చివరి రోజులు కావడంతో కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు మిగిలిపోయిన సెలవులు ఉపయోగించుకొని కుటుంబాలతో టూర్లు వస్తుంటారు. ఈ సీజన్‌లో పశ్చిమ బెంగాల్, ఒడిశాల నుంచి ఎక్కువ మంది విశాఖపట్నం వస్తారు. ఇక్కడ నుంచి అరకులోయ, వంజంగి, లంబసింగి వెళతారు. సహజంగానే ఈ సమయంలో పర్యాటక ప్రాంతాలన్నీ రద్దీగా ఉంటాయి. గురువారం క్రిస్మస్ సెలవు కావడంతో నగరవాసులు కూడా చాలామంది కుటుంబాలతో బయటకు వచ్చారు. దాంతో రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. సింహాచలంలో అప్పన్న దర్శనానికి భక్తులు భారీగా బారులుతీరి కనిపించారు. అదేవిధంగా బీచ్ మార్గంలో ట్రాఫిక్ పోలీసుల నియంత్రణ లేకపోవడంతో టూరిస్ట్ ఆపరేటర్లు వారి వ్యాన్లు, బస్సులను నేరుగా కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం వద్దకు తీసుకువచ్చి నిలిపివేయడంతో ఆ మార్గంలో పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. బీచ్‌రోడ్డు నుంచి సిరిపురం వచ్చేమార్గంలో ఆకాశవాణి కేంద్రం వద్ద కూడా అదే పరిస్థితి. మరో వైపు పండుగ షాపింగ్‌కు వచ్చిన వారితో జగదాంబ సెంటర్, డాబాగార్డెన్స్, మద్దిలపాలెం సీఎంఆర్ జంక్షన్, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం మార్గాల్లో వాహనాలు బారులు తీరిపోయాయి. ఈ మార్గంలో పదిహేను నిమిషాల్లో ఇళ్లకు చేరాల్సిన వారు గంటకు పైగా వేచి ఉండాల్సి వచ్చింది. నగరంలో సంక్రాంతి వరకూ షాపింగ్‌కు వచ్చేవారితో ప్రతిరోజు సాయంత్రం ఈ విధంగానే ఉంటుంది. సిటీ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు మరింత మందిని అవసరమైన ప్రాంతాల్లో నియమించాల్సి ఉంది. ఈ ఇరవై రోజులు పూర్తిగా ట్రాఫిక్ నియంత్రణపైనే దృష్టిపెట్టాల్సి ఉంది.