పోటెత్తిన పర్యాటకులు
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:16 PM
మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలకు పర్యాటకులు పోటెత్తారు. కార్తీక మాసం ముగిసినప్పటికీ వాతావరణం అనుకూలించడంతో పాటు ప్రకృతి అందాలు మరింత సుందరంగా దర్శనమిస్తుండడంతో అధిక సంఖ్యలో జనం మన్యం బాట పడుతున్నారు.
సందర్శకులతో కిటకిటలాడిన పర్యాటక ప్రాంతాలు
ఏజెన్సీలో ఆకట్టుకుంటున్న సహజసిద్ధ ప్రకృతి అందాలు
పాడేరు, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలకు పర్యాటకులు పోటెత్తారు. కార్తీక మాసం ముగిసినప్పటికీ వాతావరణం అనుకూలించడంతో పాటు ప్రకృతి అందాలు మరింత సుందరంగా దర్శనమిస్తుండడంతో అధిక సంఖ్యలో జనం మన్యం బాట పడుతున్నారు. దీంతో ఆదివారం ఏజెన్సీలో ఎక్కడ చూసినా పర్యాటకులే కనిపించారు.
అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందడి నెలకొంది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, గిరి గ్రామదర్శిని, ఆయా ప్రాంతాల్లోని వలిసెలు పూల తోటలు, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి గెడ్డ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్, చెరువువేనం మేఘాల కొండ, లంబసింగి, యర్రవరం జలపాతం తదితర ప్రాంతాలను పర్యాటకులు సందర్శించారు. గతంతో పోలిస్తే ఈ ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. దీంతో అరకులోయ, పాడేరు, చింతపల్లి, లంబసింగి ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది.