పర్యాటక సందడి
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:21 AM
నగరం పర్యాటకులతో కిటకిటలాడుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సీజన్‌లో పర్యాటకులు తరలివచ్చారు.
సందర్శనీయ స్థలాల వద్ద భారీగా క్యూలు
హోటళ్లన్నీ ఫుల్...నో రూమ్
కిటకిటలాడుతున్న ఆర్కే బీచ్‌రోడ్డు
తెన్నేటి పార్కు, జోడుగుళ్లపాలెం సహా నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్‌లు
విశాఖపట్నం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి):
నగరం పర్యాటకులతో కిటకిటలాడుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సీజన్‌లో పర్యాటకులు తరలివచ్చారు. ముఖ్యంగా కైలాసగిరిపై ఏర్పాటుచేసిన గ్లాస్ బ్రిడ్జి, బీచ్ రోడ్డులో కురుసుర సబ్‌మెరైన్, హెలికాప్టర్ మ్యూజియాలను చూడడానికి బారులు తీరుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చినవారంతా బస కోసం హోటళ్లను ఆశ్రయిస్తున్నారు. ప్రయాణానికి నెల రోజుల ముందుగానే అన్నీ బుక్ చేసుకున్న వారికి ఇబ్బందులు ఏమీ లేవు. రెండు, మూడు రోజులు సెలవులు వచ్చాయని, ఆకస్మికంగా ప్రయాణం పెట్టుకున్న వారికి హోటళ్లలో రూమ్ దొరకడం కష్టంగా ఉంది.
నగరంలో స్టార్ హోటళ్లు, బడ్జెట్ హోటళ్లు, లాడ్జీలు అన్నీ కలుపుకొంటే పది వేలలోపే రూములు ఉన్నాయి. రూమ్‌కు స్టార్ హోటళ్లలో రోజుకు రూ.15 వేలపైనే తీసుకుంటున్నారు. బీచ్ రోడ్డులో ఓ హోటల్ అయితే రూ.20 వేల కంటే తక్కువకు రూమ్‌లు లేవని చెబుతోంది. ఆ తరువాత స్థాయి హోటళ్లలో రూమ్ రూ.5 వేల నుంచి రూ.పది వేలుగా ఉంటోంది. డిమాండ్ బాగుండడంతో ఒక మాదిరి హోటళ్లు కూడా రోజుకు రూ.5 వేలు వసూలు చేస్తున్నాయి. అడిగినంత రేటు ఇస్తామన్నా హోటళ్లలో గదులు దొరకడం లేదు. దాంతో పలుకుబడి ఉన్న వారు ప్రభుత్వ, ప్రైవేటు గెస్ట్‌హౌస్‌ల కోసంప్రయత్నిస్తున్నారు. అవి కూడా ఇప్పటికే బుక్ అయిపోయాయనే సమాధానం వస్తోంది.
రేట్లు పెంచేసిన ట్రావెల్స్
విశాఖపట్నం వచ్చేవారు ఇక్కడి నుంచి అరకులోయ, పాడేరు, లంబసింగి వంటి ప్రాంతాలకు వెళుతున్నారు. ఆయా ప్రాంతాలకు బస్సు సదుపాయం తక్కువగా ఉండడం, ఉన్న ఒకే ఒక్క రైలు కిక్కిరిసి ఉంటుండడంతో బృందాలుగా ఏర్పడి ఇన్నోవా కార్లు బుక్ చేసుకుంటున్నారు. ఇంతకు ముందు అరకుకు ఉదయం వెళ్లి రాత్రికి తీసుకువస్తే రూ.8,500 తీసుకునేవారు. ఇప్పుడు రూ.పది వేలు డిమాండ్ చేస్తున్నారు. అడిగినంత ఇస్తే తప్ప రావడం లేదు. ఈ రోజు వెళ్లి రాత్రికి అరకులోయలో ఉండి మరుసటిరోజు తిరిగి వెనక్కి తీసుకువస్తే ఇంతకు ముందు రూ.12 వేల నుంచి రూ.13 వేలు తీసుకునేవారు. ఇప్పుడు రూ.15 వేలు డిమాండ్ చేస్తున్నారు.
ట్రాఫిక్ జామ్‌లు
క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు షాపింగ్‌లకు కూడా ఇప్పుడే చేస్తుండడంతో నగరంలో రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా పర్యాటకులతో కైలాసగిరికి వెళ్లే విశాలాక్షి నగర్, జోడుగుళ్లపాలెం, తెన్నేటి పార్కు, ఆర్‌కే బీచ్ రోడ్డు, ఇటు జగదాంబ సెంటర్, మద్దిలపాలెం జంక్షన్లలో ట్రాఫిక్ గంటల కొద్దీ నిలిచిపోతోంది. ఆ మార్గాల్లో వెళ్లడం ఇబ్బందిగా మారింది.
జనవరి 4 వరకూ ఇదే పరిస్థితి
ఎంవీ పవన్ కార్తీక్, ప్రెసిడెంట్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్
ఈ ఏడాది పర్యాటకుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. ఇయర్ ఎండింగ్ కావడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఫ్యామిలీతో వస్తున్నారు. కనీసం రెండు రోజులు హోటల్‌లో ఉంటున్నారు. హోటళ్లలో రద్దీ జనవరి 4వ తేదీ ఉంటుంది. అప్పటివరకూ రూమ్‌లు ఖాళీలు లేవు.