పర్యాటకుల కోలాహలం
ABN , Publish Date - Dec 21 , 2025 | 11:29 PM
మన్యంలోని పర్యాటక ప్రాంతాలు ఆదివారం కిటకిటలాడాయి. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం, మంచు దట్టంగా కురుస్తుండడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు.
మన్యంలోని పర్యాటక ప్రాంతాలు కిటకిట
సహజ సిద్ధ ప్రకృతి అందాలు, మంచు మేఘాలకు ఫిదా
లంబసింగి, వంజంగి మేఘాల కొండ వద్ద ఎక్కువ రద్దీ
పాడేరు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని పర్యాటక ప్రాంతాలు ఆదివారం కిటకిటలాడాయి. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం, మంచు దట్టంగా కురుస్తుండడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. దీంతో అన్ని పర్యాటక కేంద్రాల్లో సందడి నెలకొంది.
అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు పర్యాటకుల కోలాహలం కనిపించింది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, గిరి గ్రామదర్శిని, ఆయా ప్రాంతాల్లోని వలిసెలు పూల తోటలు, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి గెడ్డ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్, చెరువులవేనం మేఘాల కొండ, లంబసింగి, యర్రవరం జలపాతం తదితర ప్రాంతాలను పర్యాటకులు సందర్శించారు.
వంజంగి మేఘాల కొండపై..
పాడేరురూరల్: పాడేరు మండలంలోని వంజంగి మేఘాల కొండ ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, తదితర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు కూడా శనివారం సాయంత్రానికే పాడేరుకు చేరుకున్నారు. కుటుంబాలతో వచ్చిన వారంతా పాడేరులో లాడ్జిల్లో రాత్రి బస చేసి ఆదివారం వేకువజాము 5 గంటలకు వంజంగి మేఘాల కొండను తరలి వచ్చారు. మరికొందరు పర్యాటకులు నేరుగా వంజంగి ప్రాంతానికి చేరుకుని అక్కడ రిసార్ట్స్‌లో క్యాంప్ ఫైర్‌లు, గిరిజన సంప్రదాయ థింసా నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆనందంగా గడిపారు. ఉదయాన్నే కొండకు చేరుకున్నారు. గత వారం రోజులుగా చలి తీవ్రత, మంచు అధికంగా ఉండడంతో పర్యాటకులు ప్రకృతి అందాలను తిలకిస్తూ పరవశించిపోయారు. మేఘాల కొండపై పాల సముద్రాన్ని తలపించే మంచు మేఘాలు, సూర్యోదయం వేళ మంచును చీల్చుకుని వచ్చే భానుడి కిరణాలు పర్యాటకుల మదిని దోచుకున్నాయి. మేఘాల కొండను ఆదివారం 3,500 మంది పర్యాటకులు సందర్శించగా, అటవీ శాఖ ఆధ్వర్యంలోని ఎకో టూరిజానికి రూ.1,60,680 ఆదాయం వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. పర్యాటకుల తాకిడి అధికంగా ఉండడంతో సీఐ డి.దీనబందు పర్యవేక్షణలో ఎస్‌ఐ ఎల్.సుందరరావు బృందం ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు చేపట్టారు.
కొత్తపల్లి జలపాతం వద్ద...
జి.మాడుగుల: మండలంలోని కొత్తపల్లి జలపాతానికి ఆదివారం పర్యాటకుల తాకిడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి సందర్శకులు భారీగా తరలిరావడంతో జలపాతం పరిసరాలు కిటకిటలాడాయి. పర్యాటకులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉల్లాసంగా గడిపారు. స్నానాలు చేస్తూ, సెల్ఫీలు దిగుతూ కేరింతలు కొట్టారు.