Share News

పర్యాటక ప్రాంతాలు కిటకిట

ABN , Publish Date - Dec 13 , 2025 | 10:58 PM

మన్యంలోని శనివారం పర్యాటకుల సందడి నెలకొంది. శీతాకాలం కావడంతో ఏజెన్సీలో ప్రకృతి అందాలు మరింత ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి.

 పర్యాటక ప్రాంతాలు కిటకిట
చెరువులవేనంలో సందడి చేస్తున్న పర్యాటకులు

భారీగా తరలివచ్చిన పర్యాటకులు

మన్యంలో మంచు అందాలకు ఫిదా

జలపాతాల్లో సందడి చేసిన సందర్శకులు

పాడే రు, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి):

మన్యంలోని శనివారం పర్యాటకుల సందడి నెలకొంది. శీతాకాలం కావడంతో ఏజెన్సీలో ప్రకృతి అందాలు మరింత ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాలను సందర్శించేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు పర్యాటక సందడి నెలకొంది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, డుంబ్రిగుడలో చాపరాయి జలవిహారీ, పాడేరు మండలంలో వంజంగి హిల్స్‌, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్‌, చెరువువేనం మేఘాలకొండ, లంబసింగి ప్రాంతాలకు అధిక సంఖ్యలో సందర్శకులు విచ్చేశారు.

మదిని దోచిన మేఘాల పర్వతం

పాడేరురూరల్‌:పాడేరు మండలంలో ప్రకృతి ప్రియుల మదిని దోచే వంజంగి మేఘాల పర్వతంపై పర్యాటకుల శనివారం సందడి చేశారు. పాల సముద్రాన్ని తలపించే మంచు అందాలను తిలకించేందుకు మైదాన ప్రాంతం నుంచి పర్యాటకులు శుక్రవారం సాయంత్రానికే పాడేరుకు చేరుకొని రాత్రి బస చేశారు. శనివారం ఉదయం 4 గంటల సమయంలో వంజంగి మేఘాల పర్వతానికి తరలివెళ్లారు. ఉదయం 5 గంటల నుంచి కురిసిన మంచు అందాలు, సూర్యోదయం వేళ మంచును చీల్చుకొని వచ్చే భానుడి కిరణాలతో పర్యాటకులు పులకరించిపోయారు. పర్యాటకులకు ఎకో-టూరిజం నిర్వాహకులు స్వాగతం పలుకుతున్నారు. పర్యాటకుల వాహనాలను నిలిపేందుకు అవసరమైన పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. మేఘాల పర్వతంపై ప్లాస్టిక్‌ నిషేధించామని, పర్యాటకులు సహకరించాలని నిర్వాహకులు కోరుతున్నారు. శనివారం వంజంగిని 1600 మంది సందర్శించగా రూ. 1,37,220 ఆదాయం వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు వంజంగి రిసార్ట్స్‌ ఆర్గనైజర్లు ఫైర్‌ క్యాంప్‌లు, గిరిజన సంప్రదాయ దింసా నృత్యాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కేంద్రం పాడేరుకు పర్యాటకుల తాకిడి పెరగడంతో టిఫిన్‌, భోజన హోటళ్లు, లాడ్జీలు రద్దీగా మారాయి.

లంబసింగికి పర్యాటకుల తాకిడి

చింతపల్లి: ఆంధ్రకశ్మీర్‌ లంబసింగిలో పర్యాటకులు సందడి చేశారు. శనివారం లంబసింగి ప్రకృతి అందాలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. దీంతో ఉదయం ఐదు గంటల నుంచే లంబసింగి, చెరువులవేనం, తాజంగి జలాశయాలకు పర్యాటకుల తాకిడి పెరిగింది. చెరువులవేనం వ్యూపాయింట్‌ వద్ద పర్యాటకులు మంచు అందాలను వీక్షిస్తూ ఎంజాయ్‌ చేశారు. ప్రకృతి అందాలను కెమెరాలో బంధించేందుకు సందర్శకులు పోటీపడ్డారు. తాజంగి జలాశయంలో సాహస క్రీడలు, బోటింగ్‌ చేసేందుకు ఆసక్తి చూపారు. సాయంత్రం వరకు లంబసింగి పరిసర పర్యాటక ప్రాంతాలు రద్దీగా కనిపించాయి. అయితే లంబసింగిలో చలి, మంచు అందాలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తున్నప్పటికి స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

అరకులోయలో సందడే సందడి

అరకులోయ: అందాల అరకులోయకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చారు. వరుసగా రెండు రోజులు సెలవు కావడంతో తెల్లవారు జాము నుంచి మాడగడ సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌ సందర్శనకు పర్యాటకులు పోటెత్తారు. రాత్రి అయినప్పటికీ ట్రైబల్‌ మ్యూజియాన్ని సందర్శించేందుకు పర్యాటకులు వస్తునే ఉన్నారు. సందర్శిత ప్రాంతాలన్నీ సందర్శకులతో కళకళలాడాయి. ఘాట్‌రోడ్‌లో కాఫీతోటలు, సుంకరమెట్ట కాఫీతోటల ఉడెన్‌బ్రిడ్జి, గాలికొండ వ్యూపాయింట్‌, ట్రైబల్‌ మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌లకు పర్యాటకులు పోటెత్తారు. పర్యాటక ప్రాంతాల్లో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. అదేవిధంగా స్కై సైక్లింగ్‌, జిప్‌లైనర్‌లో యువత హుషారుగా పాల్గొన్నారు. పద్మాపురం గార్డెన్‌లోని హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ను ఎక్కి అరకులోయ అందాలు తిలకించారు.

బొర్రా గుహలు కిటకిట

అనంతగిరి: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు శనివారం పర్యాటకులు పోటెత్తారు. గుహలను 6,500 మంది సందర్శించగా రూ.5 లక్షల వరకు ఆదాయం వచ్చిందని మేనేజర్‌ గౌరీ శంకర్‌ తెలిపారు. తాటిగుడ, కటికి జలపాతాల వద్ద పర్యాటకులు సందడి చేశారు. పర్యాటకులు రాకతో సందర్శిత ప్రాంతాలన్నీ కళకళలాడాయి.

కొత్తపల్లి జలపాతంలో సందడి

జి.మాడుగుల: మండలంలోని కొత్తపల్లి జలపాతంలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. మైదాన ప్రాంతాలకు చెందిన సందర్శకులు జలపాతంలో స్నానాలు చేస్తూ ఆనందంగా గడిపారు. తగిన జాగ్రత్తలు పాటించాలని పర్యాటకులకు ఏకో టూరిజం సభ్యులు సూచనలు చేశారు. కాగా జలపాతం ఆవరణలో వాహనాలతో కిక్కిరిసింది.

Updated Date - Dec 13 , 2025 | 10:58 PM