Share News

మన్యంలో మళ్లీ పర్యాటక సందడి

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:25 PM

మన్యంలోని పర్యాటకుల సందడి నెలకొంది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత సందర్శకుల తాకిడి తగ్గింది. గతవారం నుంచి ఏజెన్సీలో పర్యాటకుల రాక మొదలైంది.

మన్యంలో మళ్లీ పర్యాటక సందడి
చాపరాయిలో సందడి చేస్తున్న పర్యాటకులు

పర్యాటకులతో కిటకిటలాడుతున్న సందర్శక ప్రాంతాలు

జలపాతాల్లో జలకాలాటలు

ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తున్న సందర్శకులు

పాడేరు, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని పర్యాటకుల సందడి నెలకొంది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత సందర్శకుల తాకిడి తగ్గింది. గతవారం నుంచి ఏజెన్సీలో పర్యాటకుల రాక మొదలైంది. ఈ ఆదివారం అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందర్శకుల హడావిడి నెలకొంది. అనంతగిరి మండలం బొర్రా గుహలు, కటిక, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహరీ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి, ప్రాంతాలను ఆదివారం పర్యాటకులు సందర్శించారు. అలాగే పాడేరులోని మోదకొండమ్మ ఆలయానికి, ఘాట్‌లోని అమ్మవారి పాదాలుకు అధిక సంఖ్యలో భక్తులు, సందర్శకులు విచ్చేసి అక్కడే వంటలు చేసుకుని భోజనాలు చేసి తిరుగు ప్రయాణమయ్యారు.

చాపరాయి జలవిహరిలో..

డుంబ్రిగుడ: ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయి జలవిహరికి ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులు తరలిరావడంతో సందడి నెలకొంది. జలపాతం వద్ద స్నానాలు చేస్తూ.. ఫొటోలు, సెల్ఫీలు దిగారు. సంప్రదాయ నృత్యం ధింసాను తిలకిస్తూ కుటుంబ సమేతంగా ఆనందంగా గడిపారు.

కొత్తపల్లి జలపాతంలో..

జి.మాడుగుల: మండలంలోని కొత్తపల్లి జలపాతంలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. జలపాతం నుంచి జాలువారుతున్న నీటిలో స్నానాలు చేస్తూ రోజంతా గడిపారు. జలపాతం చుట్టూ ప్రకృతి సోయగాన్ని ఆస్వాదించారు.

Updated Date - Jun 15 , 2025 | 11:25 PM