Share News

పర్యాటక సందడి

ABN , Publish Date - Dec 27 , 2025 | 10:52 PM

మన్యంలోని టూరిజం జోష్‌ కొనసాగుతున్నది. శనివారం పర్యాటక ప్రదేశాల్లో సందర్శకుల సందడి నెలకొంది.

  పర్యాటక సందడి
చాపరాయిలో జలకాలాడుతున్న పర్యాటకులు

మన్యంలో కిటకిటలాడుతున్న సందర్శనీయ ప్రదేశాలు

చాపరాయి వద్ద స్నానాలు చేస్తూ సందడి చేసిన పర్యాటకులు

పాడేరు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని టూరిజం జోష్‌ కొనసాగుతున్నది. శనివారం పర్యాటక ప్రదేశాల్లో సందర్శకుల సందడి నెలకొంది. వాతావరణం అనుకూలించడం, వరుస సెలవులు కావడంతో స్నేహితులు, కుటుంబాలతో కలిసి ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాల సందర్శనకు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందడి నెలకొంది. బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియమ్‌, పద్మాపురం ఉద్యానవనం, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి గెడ్డ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్‌, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్‌, చెరువువేనం మేఘాలకొండ, లంబసింగి ప్రాంతాల్లో పర్యాటకుల హడావుడి నెలకొంది.

కళకళలాడిన వంజంగి

పాడేరురూరల్‌: పాడేరు మండలం వంజంగి మేఘాల పర్వతం గురువారం పర్యాటకులతో కళకళలాడింది. సెలవులు రావడంతో ప్రకృతి ప్రియులు కుటుంబ సభ్యులతో శుక్రవారం రాత్రికే పాడేరు, వంజంగి ప్రాంతాలకు చేరుకొని రాత్రి బస చేసి శనివారం ఉదయం నాలుగు గంటల నుంచి కొండపైకి వెళ్లి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. పర్యాటకుల తాకిడి ఎక్కువ కావడంతో పాడేరులో లాడ్జీలు దొరక్కపోవడంతో వందలాది మంది పర్యాటకులు ప్రధాన రహదారులపై చలి మంటలు కాచుకుంటూ కాలక్షేపం చేశారు. వంజంగి మేఘాల పర్వతంపై పాల సముద్రాన్ని తలపించే మంచు, సూర్యోదయం వేళ మంచును చీల్చుకుంటూ వచ్చే భానుడి కిరణాలకు పర్యాటకులు మంత్రముగ్దులవుతున్నారు. శనివారం వంజంగికి 3,643 మంది పర్యాటకులు సందర్శించగా ఎ-కో టూరిజంకు రూ.1,91,260 ఆదాయం వచ్చిందని అటవీ శాఖ డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ కాళీ ప్రసాద్‌ తెలిపారు. పర్యాటకుల తాకిడి అధికం కావడంతో పాడేరు ప్రధాన రహదారులు, భోజన, టిఫిన్‌ హోటళ్లు రద్దీగా ఉన్నాయి.

చాపరాయిలో కోలాహలం

డుంబ్రిగుడ: మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చాపరాయి జలవిహారికి శనివారం అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. చాపరాయి వద్ద స్నానాలు చేస్తూ పర్యాటకులు సందడి చేశారు. తిరుగు ప్రయాణంలో పంతలచింత గ్రామ సమీప పొద్దుతిరుగుడు తోటలో సెల్ఫీలు దిగారు. అరకు ఫినరీలో ఎతైన చెట్ల మధ్య కుటుంబ సమేతంగా సాయంత్రం వరకు సరదాగా గడిపారు.

Updated Date - Dec 27 , 2025 | 10:52 PM