Share News

గొయ్యిలో కూరుకుపోయిన టూరిస్టు బస్సు

ABN , Publish Date - Oct 25 , 2025 | 11:06 PM

పాడేరు ఆర్‌అండ్‌బీ డివిజన్‌ పరిధిలోని సీలేరు-పాలగెడ్డ (డొంకరాయి) ప్రధాన రహదారిలో శనివారం తెల్లవారు జామున పెద్ద గొయ్యిలో టూరిస్టు బస్సు కూరుకుపోయింది. దీంతో ఈ రహదారిలో 7 గంటల పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

గొయ్యిలో కూరుకుపోయిన టూరిస్టు బస్సు
సీలేరు-డొంకరాయి రహదారిలో బెంగాలీ క్యాంప్‌ వద్ద గొయ్యిలో కూరుకుపోయిన టూరిస్టు బస్సు

సీలేరు-పాలగెడ్డ రోడ్డులో ఏడు గంటలు నిలిచిన రాకపోకలు

ఆహారం, నీరు దొరక్క ఇబ్బంది పడిన టూరిస్టులు

ఆర్‌అండ్‌బీ అధికారులపై మండిపడిన వాహనదారులు

సీలేరు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): అరకు నుంచి భద్రాచలానికి టూరిస్టులతో వెళుతున్న శ్రీరామదూత బస్సు శనివారం తెల్లవారుజామున సీలేరు- పాలగెడ్డ రహదారిలో బెంగాలీ క్యాంప్‌ సమీప అటవీ ప్రాంతంలో గల పెద్ద గొయ్యిలో కూరుకుపోయింది. దీంతో విజయవాడ, సీలేరు, భద్రాచలం, జైపూర్‌ బస్సులతో పాటు ఇతర వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకల పునరుద్ధరణకు సమయం పడుతుందని విజయవాడ బస్సులో ప్రయాణిస్తున్న సీలేరు ప్రయాణికులను అక్కడే దించేసి సిబ్బంది వెనక్కి వెళ్లిపోయారు. ఉదయం 11 గంటల సమయంలో ఒక ట్రాక్టర్‌ సాయంతో కూరుకుపోయిన బస్సును బయటకు తీయడంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. బస్సులోని ప్రయాణికులు కారడవిలో చిక్కుకుపోవడంతో ఉదయం తినడానికి టిఫిన్‌ కూడా లభ్యం కాక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మంచి నీరు కూడా దొరకలేదు. అలాగే భద్రాచలం, జైపూర్‌, విజయవాడ, సీలేరు బస్సుల్లో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. సీలేరు-పాలగెడ్డ రహదారి కొన్ని సంవత్సరాలు అధ్వానంగా ఉన్నా ఆర్‌అండ్‌బీ అధికారులు గోతులను పూడ్చడం లేదు. బెంగాలీ క్యాంప్‌ సమీపంలో ఉన్న పెద్ద గోతుల్లో తరచూ వాహనాలు కూరుకుపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నది. అయినా ఆర్‌అండ్‌బీ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప గోతులను పూడ్పించడం లేదని వాహనదారులు, గిరిజనులు మండిపడుతున్నారు.

Updated Date - Oct 25 , 2025 | 11:06 PM