Share News

పర్యాటక ప్రాంతాలు వెలవెల

ABN , Publish Date - Mar 09 , 2025 | 11:25 PM

మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలు పర్యాటకులు లేక వెలవెలబోతున్నాయి. వాతావరణంలో మార్పులతో పాటు విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరుగుతుండడంతో ఆదివారం పర్యాటకుల సందడి కనిపించలేదు.

పర్యాటక ప్రాంతాలు వెలవెల
చెరువులవేనం వద్ద సందర్శకులు

వాతావరణంలో మార్పు, విద్యార్థులకు వార్షిక పరీక్షలే కారణం

పాడేరు, మార్చి 9(ఆంధ్రజ్యోతి): మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలు పర్యాటకులు లేక వెలవెలబోతున్నాయి. వాతావరణంలో మార్పులతో పాటు విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరుగుతుండడంతో ఆదివారం పర్యాటకుల సందడి కనిపించలేదు. అనంతగిరి మండలం బొర్రా గుహలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారి, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్‌, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి, చెరువువేనం, లంబసింగి ప్రాంతాలు పర్యాటకులు లేక బోసిపోయాయి.

లంబసింగిలో..

చింతపల్లి: ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి పర్యాటకుల తాకిడి తగ్గింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగడం, వాతావరణంలో మార్పు రావడంతో సందర్శకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. వీకెండ్స్‌లో అతి తక్కువ మంది పర్యాటకులు లంబసింగిని సందర్శిస్తున్నారు. గిరిజన ప్రాంతంలో వేసవి వాతావరణం కనిపిస్తున్నప్పటికి ఉదయం ఎనిమిది గంటల వరకు ఓ మాదిరిగా మంచు కురుస్తున్నది. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో చల్లని వాతావరణం ఉంటుంది. దీంతో సీజన్‌ ముగిసినప్పటికి పర్యాటకులు లంబసింగిని సందర్శిస్తున్నారు. ఆదివారం లంబసింగి వచ్చిన పర్యాటకులు ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు చెరువులవేనం వ్యూపాయింట్‌ వద్ద సందడి చేశారు. అనంతరం తాజంగి జలాశయం వద్ద సాహస క్రీడల్లో పాల్గొన్నారు. సాయంత్రం వరకు స్ట్రాబెర్రీ తోటలను సందర్శించి తిరుగు ప్రయాణమయ్యారు.

బొర్రా గుహలు వద్ద..

అనంతగిరి: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు ఆదివారం పర్యాటకులు స్వల్పంగా వచ్చారు. 1,414 మంది బొర్రా గుహలను సందర్శించగా, రూ.1.14 లక్షల ఆదాయం వచ్చిందని మేనేజర్‌ గౌరీ శంకర్‌ తెలిపారు. అలాగే ప్రముఖ పర్యాటక కేంద్రాలైన కటికి, తాటిగుడ, సరియా జలపాతాలతో పాటుగా డముకు వ్యూపాయింట్‌ వద్ద పర్యాటకులు అంతంతమాత్రంగానే కనిపించారు.

Updated Date - Mar 09 , 2025 | 11:25 PM