Share News

పర్యాటక ప్రాంతాలు కిటకిట

ABN , Publish Date - Dec 26 , 2025 | 10:42 PM

మన్యంలోని పర్యాటక ప్రదేశాల్లో శుక్రవారం సైతం సందర్శకుల హడావిడి నెలకొంది. క్రిస్మస్‌, వరుస సెలవులు కావడంతో వీకెండ్‌ను మించి పర్యాటకులు ఏజెన్సీ ప్రాంతానికి తరలివచ్చేశారు.

పర్యాటక ప్రాంతాలు కిటకిట
కొత్తపల్లి జలపాతంలో సందడి చేస్తున్న పర్యాటకులు

సందర్శకుల కోలాహలం

క్రిస్మస్‌, సెలవులతో మన్యం బాట

మైమరపించిన మంచు, ప్రకృతి అందాలు

జలపాతాల్లో జలకాలాటలు

పాడేరు, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని పర్యాటక ప్రదేశాల్లో శుక్రవారం సైతం సందర్శకుల హడావిడి నెలకొంది. క్రిస్మస్‌, వరుస సెలవులు కావడంతో వీకెండ్‌ను మించి పర్యాటకులు ఏజెన్సీ ప్రాంతానికి తరలివచ్చేశారు. ప్రస్తుతం కాశ్మీరును తలపించేలా మంచు అందాలతో పాటు ఊటీని మించిన పచ్చదనంలో ప్రకృతి అందాలు దర్శనమిస్తున్నాయి. దీంతో స్నేహితులు, కుటుంబాలతో కలిసి ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాల సందర్శనలకు వస్తున్నారు. శుక్రవారం సైతం ఏజెన్సీలో ఎక్కడ చూసినా పర్యాటకుల సందడే కనిపించింది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందడి నెలకొంది. బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి గెడ్డ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్‌, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్‌, చెరువువేనం మేఘాల కొండ, లంబసింగి ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీ నెలకొంది. దీంతో అరకులోయ, పాడేరు, లంబసింగి ప్రాంతాల్లో పర్యాటకుల సందడి అధికంగా కన్పించింది.

కొత్తపల్లి జలపాతం కిటకిట

జి.మాడుగుల: మండలంలోని కొత్తపల్లి జలపాతం వద్ద శుక్రవారం పర్యాటకులు బారులు తీరారు. క్రిస్మస్‌ వరుస సెలవులు రావడంతో రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా సందర్శకులు తరలిరావడంతో జలపాతం అంతా కోలహలం నెలకొంది. పార్కింగ్‌ ప్రదేశం భారీగా వాహనాలతో కిక్కిరిసింది.

సీలేరులో పర్యాటకుల రద్దీ

సీలేరు: సీలేరులో శుక్రవారం పర్యాటకుల సందడి నెలకొంది. సీలేరు పరిసర ప్రాంతాల అందాలను తిలకించేందుకు మైదాన ప్రాంతాల నుంచి సందర్శకులు క్యూ కట్టారు. స్థానిక గుంటవాడ జలాశయం, జలవిద్యుత్‌ కేంద్రం, రెగ్యులేటర్‌ డ్యాం, ఇంటెక్‌ డ్యాం, బలిమెల జలాశయం తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. అనంతరం పొల్లూరు వాటర్‌ వాటర్‌పాల్స్‌, తదితర సహజసిద్ద అందలను తిలకించారు.

Updated Date - Dec 26 , 2025 | 10:42 PM