Share News

పర్యాటక ప్రాంతాలు కిటకిట

ABN , Publish Date - Nov 30 , 2025 | 11:12 PM

మన్యంలోని సందర్శనీయ ప్రాంతాలకు ఆదివారం పర్యాటకుల తాకిడి పెరిగింది. దీంతో ఆదివారం పర్యాటక ప్రాంతాల్లో సందడి నెలకొంది.

పర్యాటక ప్రాంతాలు కిటకిట
పర్యాటకులతో కిటకిటలాడుతున్న చెరువులవేనం వ్యూపాయింట్‌

మన్యానికి పెరిగిన సందర్శకుల తాకిడి

వంజంగి మేఘాల కొండకు మూడు వేల మంది రాక

కొత్తపల్లి జలపాతంలో జలకాటాలు

బొర్రాకు పోటెత్తిన పర్యాటకులు

చాపరాయి జలవిహారిలో సందడి

పాడేరు, నవంబరు 30(ఆంధ్రజ్యోతి):

మన్యంలోని సందర్శనీయ ప్రాంతాలకు ఆదివారం పర్యాటకుల తాకిడి పెరిగింది. దీంతో ఆదివారం పర్యాటక ప్రాంతాల్లో సందడి నెలకొంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో పాటు ప్రకృతి అందాలు సైతం మరింత ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఏజెన్సీలో పర్యాటకుల సందడి జోరందుకుంది. అలాగే వివిధ ప్రాంతాల నుంచి రైలు మార్గంలో అరకులోయకు అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. దీంతో ఆదివారం ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాల్లో సందర్శకుల హడావుడి నెలకొంది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు పర్యాటక సందడి నెలకొంది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారీ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్‌, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్‌, చెరువువేనం మేఘాలకొండ, లంబసింగి, యర్రవరం జలపాతం తదితర ప్రాంతాలకు అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు.

లంబసింగికి పర్యాటకుల తాకిడి

చింతపల్లి: ఆంధ్రకశ్మీర్‌ లంబసింగికి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. లంబసింగి ప్రకృతి అందాలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. దీంతో ఉదయం ఐదు గంటల నుంచే చెరువులవేనం, లంబసింగి జంక్షన్‌లో పర్యాటకుల సందడి ప్రారంభమైంది. చెరువులవేనంలో పర్యాటకులు ఉదయం 11గంటల వరకు మంచు అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్‌ చేశారు. చెరువులవేనం వ్యూపాయింట్‌కి అత్యధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో వ్యూపాయింట్‌ సందర్శకులతో కిటకిటలాడింది. తాజంగి జలాశయంలో సాహస క్రీడల్లో పాల్గొనేందుకు సందర్శకులు ఆసక్తి చూపారు. యర్రవరం జలపాతానికి సైతం అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. లంబసింగి పరిసర పర్యాటక ప్రాంతాలు, స్ట్రాబెర్రీ తోటలు సాయంత్రం వరకు పర్యాటకులతో రద్దీగా కనిపించాయి.

మైమరపించిన మంచు మేఘాలు

పాడేరురూరల్‌: మండలంలో వంజంగి మేఘాల పర్వతానికి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. వారం రోజులుగా మంచు, చలి తీవ్రత అధికంగా ఉండడంతో మైదాన ప్రాంతం నుంచి వచ్చిన పర్యాటకులను మన్యంలోని ప్రకృతి అందాలు మైమరపిస్తున్నాయి. గతంలో వంజంగి మేఘాల పర్వతం సందర్శనకు ఆదివారం మాత్రమే వచ్చే పర్యాటకులు ఇప్పుడు ప్రతి రోజూ వందల సంఖ్యలో తరలివస్తున్నారు. మేఘాల పర్వతంపై పాల సముద్రాన్ని తలపించే మంచు మేఘాలకు ప్రకృతి ప్రియులు మంత్రముగ్ధులవుతున్నారు. ఆదివారం మేఘాల కొండ సందర్శనకు మూడు వేల మంది పర్యాటకులు హాజరుకాగా ఎకో-టూరిజంకు రూ. 1 లక్ష 54 వేల 280 ఆదాయం వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. పర్యాటకులు తాకిడి అధికం కావడంతో పాడేరు పట్టణంలోని లాడ్జీలు, భోజన హోటల్స్‌ రద్దీగా మారాయి.

కొత్తపల్లి జలపాతంలో సందడి

జి.మాడుగుల: మండలంలోని కొత్తపల్లి జలపాతంలో పర్యాటకులు సందడి చేశారు. ఉదయం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు జలపాతం అందాలను ఆస్వాదించారు. జలపాతంలో స్నానాలు చేస్తూ ఆనందంగా గడిపారు. మైదాన ప్రాంతానికి చెందిన పలువురు పర్యాటకులు ఇక్కడి నుంచి తారాబు జలపాతానికి పయనమయ్యారు. దీంతో ప్రధాన రహదారిపై రద్దీ నెలకొంది.

బొర్రా గుహలకు భారీగా సందర్శకులు

అనంతగిరి: ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహలకు ఆదివారం పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ఉదయం 9:30 గంటల నుంచే బొర్రాగుహల లోపలకు పర్యాటకులను అనుమతించారు. సాయంత్రం వరకు పర్యాటకులు తరలివస్తుండడంతో రాత్రి ఏడు వరకు పర్యాటకులు గుహలను సందర్శించారు. ఆదివారం 5,900 మంది గుహలను సందర్శించగా.. రూ.4.87 లక్షల ఆదాయం వచ్చిందని యూనిట్‌ మేనేజర్‌ గౌరీశంకర్‌ తెలిపారు.

చాపరాయిలో సందడి

డుంబ్రిగుడ: మండల కేంద్రంలోని చాపరాయి జలపాతంలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. పర్యాటకుల రాకతో అరకు-పాడేరు ప్రధాన రహదారి రద్దీగా మారింది. సుమారు కిలోమీటరు మేరకు ట్రాఫిక్‌జామ్‌ అయ్యింది. గిరిజన వేషధారణలో పర్యాటకులు సందడి చేశారు. థింసా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Updated Date - Nov 30 , 2025 | 11:12 PM