Share News

పర్యాటక ప్రాంతాలు కిటకిట

ABN , Publish Date - Nov 15 , 2025 | 10:52 PM

అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాలకు వీకెండ్‌ శనివారం పర్యాటకులు పోటెత్తారు. మన్యంలో ప్రకృతి అందాలను ఆస్వాదించారు. మంచు సోయగాలకు మైమరచిపోయారు. జలపాతాల్లో జలకాలాటలాడారు.

పర్యాటక ప్రాంతాలు కిటకిట
అరకులోయ :మాడగడ సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌ వద్ద సందర్శకులు సందడి

వీకెండ్‌ కావడంతో పోటెత్తిన సందర్శకులు

ప్రకృతి అందాలు ఆస్వాదన

మైమరపించిన మంచు సోయగాలు

జలపాతాల్లో జలకాలాటలు

అరకులోయ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా ఊటీ అరకులోయకు పెద్ద ఎత్తన పర్యాటకులు తరలిరావడంతో సందర్శిత ప్రాంతాలన్నీ సందడిగా కనిపించాయి. వారం రోజుల నుంచి విపరీతంగా మంచు కురుస్తుండడంతో సందర్శకులకు మంచు అందాలు కనువిందుజేస్తున్నాయి. శనివారం తెల్లవారు జామున మాడగడ సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌కు చేరుకొని మంచు అందాలను ఆస్వాదించారు. కొందరు పర్యాటకులు ధింసా కళాకారులతో నృత్యం చేస్తూ ఫొటోలు దిగారు. మరికొందరు మంచు సోయగం కనిపించే విధంగా సెల్ఫీలు తీసుకున్నారు. మంచు అందాల నడుమ సూర్యోదయాన్ని తిలకిస్తూ సందర్శకులు ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ సందడి చేశారు. అదేవిధంగా అరకులోయ పట్టణంలోని ట్రైబల్‌ మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌, సుంకరమెట్ట కాఫీ తోటల్లో ఉడెన్‌ బ్రిడ్జి, గాలికొండ వ్యూపాయింట్‌లను పర్యాటకులు పెద్ద ఎత్తున సందర్శించారు.

లంబసింగికి తాకిడి

చింతపల్లి: ఆంధ్రకశ్మీర్‌ లంబసింగికి పర్యాటకుల తాకిడి పెరిగింది. వీకెండ్‌ శనివారం లంబసింగి ప్రకృతి అందాలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. ఉదయం ఐదు గంటల నుంచి లంబసింగి జంక్షన్‌, చెరువులవేనంలో పర్యాటకుల సందడి ప్రారంభమైంది. ఉదయం 11గంటల వరకు చెరువులవేనం వ్యూపాయింట్‌ వద్ద పర్యాటకులు ప్రకృతి అందాలను తిలకిస్తూ ఎంజాయ్‌ చేశారు. ప్రకృతి అందాలను కెమెరాల్లో బంధించారు.

బొర్రాను సందర్శించిన 2500 మంది

అనంతగిరి: ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహలను శనివారం 2,500 మంది పర్యాటకులు సందర్శించారు. సహజసిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలను తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. శనివారం బొర్రా గుహల సందర్శన ద్వారా రూ.2.18 లక్షల ఆదాయం వచ్చిందని యూనిట్‌ మేనేజర్‌ గౌరీ శంకర్‌ తెలిపారు. అలాగే కటికి, తాటిగుడ, సరియా జలపాతాలు వద్ద పర్యాటకులు స్నానాలు చేస్తూ సందడి చేశారు. అరకు-విశాఖ ప్రధాన రహదాని ఆనుకుని ఉన్న డముకు వ్యూపాయింట్‌ నుంచి వంపుసొంపులు తిరిగిన ఘాట్‌రోడ్డు అందాలను వీక్షించారు. కాఫీ ప్లాంటేషన్‌ వద్ద పర్యాటకులు పోటెత్తారు.

Updated Date - Nov 15 , 2025 | 10:52 PM