పర్యాటక ప్రాంతాలు కిటకిట
ABN , Publish Date - Aug 16 , 2025 | 10:33 PM
ఏజెన్సీలోని సందర్శనీయ ప్రదేశాలు శనివారం పర్యాటకులతో కిటకిటలాడాయి. వీకెండ్‌లో వరుసగా సెలవులు రావడంతో పర్యాటకులు మన్యం బాట పట్టారు.
వరుస సెలవుతో ఏజెన్సీ బాట పట్టిన పర్యాటకులు
బొర్రా గుహలు, అరకులోయలో సందడి వాతావరణం
పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం
పాడేరు, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలోని సందర్శనీయ ప్రదేశాలు శనివారం పర్యాటకులతో కిటకిటలాడాయి. వీకెండ్‌లో వరుసగా సెలవులు రావడంతో పర్యాటకులు మన్యం బాట పట్టారు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో శుక్రవారం సాయంత్రం నుంచే వివిధ ప్రాంతాల నుంచి ఏజెన్సీకి సందర్శకులు విచ్చేశారు. దీంతో శనివారం అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందర్శకుల సందడి నెలకొంది. ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో ఏజెన్సీలోని ప్రకృతి అందాలు మరింత సుందరంగా ఉండడంతో వాటిని తిలకించేందుకు సందర్శనీయ ప్రదేశాలకు వస్తున్నారు. అలాగే వర్షాల నేపథ్యంలో అనంతగిరి మండలంలో కటిక, తాడిగూడ జలపాతాలు, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి, చింతపల్లి మండలంలోని యర్రవరం జలపాతాల్లోకి పర్యాటకుల్ని అనుమతించకపోవడంతో ఎక్కువ మంది అనంతగిరి మండలం బొర్రా గుహలు, అరకులోయ మండలంలో గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, చింతపల్లి మండలంలో తాజంగి, చెరువువేనం, లంబసింగి ప్రాంతాలను శనివారం అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. అలాగే ఆదివారం సైతం మరింతగా పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. దీంతో పాడేరు, అరకులోయ ప్రాంతాలు శనివారం సైతం రద్దీగా మారాయి.
అరకులోయలో..
అరకులోయ: వరుస సెలవులు రావడంతో అరకులోయలో శనివారం పర్యాటకుల సందడి కనిపించింది. శుక్ర, శని, ఆదివారాలు సెలవులు కావడంతో అరకులోయ సందర్శనకు పెద్ద ఎత్తున పర్యాటకులు విచ్చేశారు. దీంతో సందర్శిత ప్రాంతాలైన ట్రైబల్ మ్యూజియం, పద్మాపురం గార్డెన్, గాలికొండ వ్యూపాయింట్, సుంకరమెట్ట వుడెన్‌బ్రిడ్జి, మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్‌ల వద్ద సందర్శకుల రద్దీ కనిపించింది. మరో వైపు సుదూరప్రాంతం నుంచి వచ్చిన సందర్శకులు హోటళ్లు, రిసార్ట్సులో బస చేశారు. చిరు దుకాణాలు రద్దీగా ఉన్నాయి. సుంకరమెట్ట ఉడెన్ బ్రిడ్జి, గాలికొండ వ్యూపాయింట్ వద్ద రెండురోజులు వాహనాల రద్దీతో ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులు నెలకొన్నాయి.
బొర్రాకు పోటెత్తిన పర్యాటకులు
అనంతగిరి: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహలకు శనివారం పర్యాటకులు పోటెత్తారు. వరుస మూడు రోజులు సెలవులు కావడంతో బొర్రా గుహల అందాలను తిలకించేందుకు పర్యాటకులు తరలివచ్చారు. గుహలను 5 వేల మంది సందర్శించగా రూ.4.5 లక్షల ఆదాయం వచ్చింది. కాఫీ ప్లాంటేషన్ పర్యాటకులు తాకిడితో సందడి మారింది.