Share News

పర్యాటకం... ప్రచారం పూజ్యం

ABN , Publish Date - Sep 27 , 2025 | 01:03 AM

విశాఖపట్నం జిల్లాలో పర్యాటక అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నా తగిన ప్రచారం కల్పించలేకపోతున్నారు.

పర్యాటకం... ప్రచారం పూజ్యం

కొత్త ప్రాజెక్టులు ప్రతిపాదనలకే పరిమితం

నగర సందర్శకుల సమాచారమూ లేదు

పూర్తిస్థాయి అధికారుల నియామకంపైనా నిర్లక్ష్యం

డిప్యుటేషన్లతోనే కాలక్షేపం

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం జిల్లాలో పర్యాటక అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నా తగిన ప్రచారం కల్పించలేకపోతున్నారు. రాష్ట్రంలో విశాఖపట్నమే ప్రధాన ఆకర్షణీయ నగరమని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా ఆ స్థాయిలో ఇక్కడి వ్యవహారాలపై దృష్టి పెట్డడం లేదు. సరైన అధికారులను నియమించడం లేదు. రాజకీయ సిఫారసుల మేరకు డిప్యుటేషన్‌పై పోస్టులను నింపుతున్నారు. పర్యాటక శాఖ రీజనల్‌ డైరెక్టర్‌ పోస్టు ఏడాదిన్నరగా ఖాళీగా ఉంది. డివిజనల్‌ అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. వారం క్రితం భర్తీ చేసినా ఆ అధికారి ఇంకా రాలేదు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏటా సెప్టెంబరు 27న నిర్వహిస్తారు. దానిని ఒక ఉత్సవంలా చేయాలి. కానీ దీనిపై ఎటువంటి ప్రచారం లేదు. మమ అనిపించడానికి మొక్కుబడిగా శనివారం చిల్డ్రర్‌ ఎరీనాలో ఓ కార్యక్రమం ఏర్పాటుచేశారు.

అంతా నాన్పుడు ధోరణే

రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రాజెక్టులు విశాఖపట్నం తెప్పిస్తున్నామని, స్టార్‌ హోటళ్లలో గదుల సంఖ్య పెంచుతున్నామని, వందల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేస్తోంది. కానీ పర్యాటకులను ఆకర్షించే చిన్న చిన్న ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. విశాఖ వచ్చే వారు తప్పనిసరిగా సముద్రంలో విహరించాలని కోరుకుంటారు. పర్యాటక శాఖకు ఓ బోటు ఉన్నా దానికి సరైన ప్రచారం లేదు. ఓ ప్రైవేటు సంస్థ చిన్నపాటి క్రూయిజ్‌ నడుపుతామని, అనుమతి ఇవ్వాలని ఏడాది క్రితం కోరింది. ఇప్పటివరకు దానికి మోక్షం లేదు. తెన్నేటి పార్కుకు ఐదేళ్ల క్రితం బంగ్లాదేశ్‌ నౌక ఎంవీ మా కొట్టుకు వచ్చింది. దానిని ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌గా మారుస్తామని నౌకను కొనుగోలు చేసిన గిల్‌ సంస్థ అప్పటి నుంచి కోరుతూనే ఉంది. దానికీ అనుమతి ఇవ్వలేదు. విశాఖపట్నం పోర్టు రూ.100 కోట్ల వ్యయంతో క్రూయిజ్‌ టెర్మినల్‌ నిర్మించింది. ఏడాదికి రెండుసార్లు కార్డిలియో క్రూయిజర్‌ తప్ప ఇంకొకటి రావడం లేదు. పర్యాటక శాఖ అధికారులు ఏమి చేస్తున్నారనేది పెద్ద ప్రశ్న.

రుషికొండ బీచ్‌ నిర్వహణలోనూ లోపాలే. దానికి గతంలో వచ్చిన బ్లూఫ్లాగ్‌ గుర్తింపు పోయేలా వ్యవహరించారు. కింద మీద పడి మళ్లీ దానిని నిలబెట్టారు. ఇప్పటికీ అది సమస్యగానే ఉంది. నిర్వహణ బాధ్యతలు ప్రైవేటు సంస్థకు అప్పగించాలని టెండర్లు పిలిచారు. అది ప్రైవేటు చేతికి వెళ్లిపోతే ఏపీటీడీసీకి అడ్డగోలుగా వచ్చే లక్షలాది రూపాయల ఆదాయం పోతుందని కఠిన నిబంధనలు పెట్టారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి.

పర్యాటక సమాచారమూ శూన్యమే

విశాఖపట్నం పర్యాటక శాఖ అఽధికారుల వద్ద నగరానికి ఎంతమంది పర్యాటకులు వస్తున్నారు? వారిలో అంతర్జాతీయ పర్యాటకులు ఎంత మంది?, దేశీయ పర్యాటకులు ఎంతమంది?, ఏయే రాష్ట్రాల నుంచి వస్తున్నారు?...అనే కనీస సమాచారం కూడా లేదు. ఎటువంటి రికార్డులు నిర్వహించడం లేదు.

డబుల్‌ డెక్కర్‌కు ఆదాయం పెంచే ఆలోచన శూన్యం

నగరంలో ఇటీవలె సీఎం చంద్రబాబునాయుడు చేతులు మీదుగా డబుల్‌ డెక్కర్‌ బస్సులు రెండింటిని ప్రారంభించారు. వాటికి టిక్కెట్‌ ధరలు పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.100 పెట్టారు. వారాంతాలైన శని, ఆదివారాల్లో తప్పితే మిగిలిన రోజుల్లో వాటికి ఆదరణ ఉండడం లేదు. ముగ్గురు, నలుగురికి మించి ఎక్కడం లేదు. ఈ బస్సులకు ఆదాయం వచ్చేలా ఎలా ఉపయోగించుకోవాలనే ఆలోచన కూడా లేదు. ఖాళీగా ఉన్నాయని తీసుకువెళ్లి సాగర్‌నగర్‌లో ఛార్జింగ్‌ పాయింట్‌ వద్ద ఉంచేస్తున్నారు. భీమిలికి బీచ్‌ మార్గంలో బస్సులు తక్కువ. అటు వైపు పేరొందిన కాలేజీలు, ఐటీ సంస్థలు ఉన్నాయి. వారికైనా ఉపయోగపడేలా...కాసింత రేటు తగ్గించి రెగ్యులర్‌గా నడిపితే ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఆ ఆలోచన కూడా లేదు.

వీఎంఆర్‌డీఏ వల్ల నిలబడుతున్న పరువు

వీఎంఆర్‌డీఏ వల్లనే పర్యాటక శాఖ పరువు నిలబడుతున్నదంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులు తీసుకువస్తూ పర్యాటకుల సంఖ్య పెంచేందుకు యత్నిస్తోంది. ఈ ఒక్క ఏడాదిలోనే కైలాసగిరిపై స్కై సైక్లింగ్‌, జిప్‌లైనర్‌ ప్రారంభించింది. అక్కడే గ్లాస్‌ బ్రిడ్జిని ప్రారంభోత్సవానికి సిద్ధం చేసింది. బీచ్‌ రోడ్డులో యుహెచ్‌-3హెచ్‌ హెలికాప్టర్‌ మ్యూజియం ప్రారంభించింది.

వీటిపై పునరాలోచన అవసరం

చిన్న చిన్న ప్రాజెక్టులు పెడతామని ముందుకు వచ్చిన వారికి ప్రభుత్వం ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదు?, దానికి కారణాలు ఏమిటి?, ఎన్ని ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయనే దానిపై ఒకసారి సమీక్షిస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి. పర్యాటక శాఖకు ప్రచారం కూడా చాలా ముఖ్యం. దానిపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంది.

విశాఖలో చూడదగిన ప్రాంతాలు...

- ఆర్కే బీచ్‌, కురుసుర సబ్‌మెరైన్‌, టీయూ-142 మ్యూజియం, సీ హ్యారియర్‌ మ్యూజియం, యుహెచ్‌-3హెచ్‌ మ్యూజియం, విశాఖ మ్యూజియం, వీఎంఆర్‌డీఏ పార్క్‌, సిటీ సెంట్రల్‌ పార్క్‌, తెన్నేటి పార్క్‌, కైలాసగిరి, రుషికొండ బీచ్‌, తొట్లకొండ, భీమిలి బీచ్‌, ఎర్రమట్టి దిబ్బలు. యారాడ బీచ్‌, సాగర్‌ దుర్గా ఆలయం, డాల్ఫిన్‌ నోస్‌ కొండ

నేడు అన్నింటిలోను ఉచిత ప్రవేశం

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా వీఎంఆర్‌డీఏ నగర ప్రజలకు బంఫర్‌ ఆఫర్‌ ప్రకటించింది. బీచ్‌రోడ్డులో మ్యూజియాలతో పాటు అన్ని పార్కులు, కైలాసగిరిపైకి ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్టు తెలిపింది. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

Updated Date - Sep 27 , 2025 | 01:03 AM