అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాజెక్టులు
ABN , Publish Date - Jul 03 , 2025 | 01:08 AM
విశాఖపట్నంలో చేపట్టబోయే పర్యాటక ప్రాజెక్టులన్నీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉండాలని పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో విశాఖపట్నం, విజయనగరం జిల్లాల అధికారులతో ఆయన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో భవిష్యత్తులో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తారని, వాటికి ఉపయోగపడేలా స్టార్ రేటింగ్ కలిగిన హోటళ్లను నిర్మించి వాటిలో పది వేల రూమ్‌లు సిద్ధం చేయాల్సి ఉందన్నారు.
స్టార్ రేటింగ్ కలిగిన హోటళ్లలో పది వేల రూమ్‌ల నిర్మాణమే లక్ష్యం
అధికారుల సమీక్షా సమావేశంలో పర్యాటక శాఖ
స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్
ఒబెరాయ్, మై ఫెయిర్ హోటళ్ల నిర్మాణానికి
మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశం
విశాఖపట్నం, జూలై 2 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో చేపట్టబోయే పర్యాటక ప్రాజెక్టులన్నీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉండాలని పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో విశాఖపట్నం, విజయనగరం జిల్లాల అధికారులతో ఆయన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో భవిష్యత్తులో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తారని, వాటికి ఉపయోగపడేలా స్టార్ రేటింగ్ కలిగిన హోటళ్లను నిర్మించి వాటిలో పది వేల రూమ్‌లు సిద్ధం చేయాల్సి ఉందన్నారు. భోగాపురం సమీపాన నిర్మిస్తున్న ఒబెరాయ్ హోటల్‌కు, భీమిలి సమీపాన అన్నవరంలో నిర్మించనున్న మై ఫెయిర్ హోటల్ నిర్మాణాలకు మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం ఆయా నిర్మాణాలు సకాలంలో పూర్తికావడానికి అధికారులు సహకరించాలని సూచించారు. విశాఖ జిల్లాలో పర్యాటక ప్రాజెక్టుల భూముల క్రమబద్ధీకరణపై చర్చించారు. నగరానికి వచ్చే పర్యాటకులకు అడ్వంచర్, వాటర్ స్పోర్ట్స్, క్రూయిజ్‌లపై అందరికీ అవగాహన కల్పించేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రుషికొండ, మధురవాడ, భీమిలి, కాపులుప్పాడ, దబ్బంద, ఎండాడ, యారాడ తదితర ప్రాంతాల్లో చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి ఆయనకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ వివరించారు. సమావేశంలో వీఎంఆర్‌డీఏ కమిషనర్ కె.విశ్వనాథన్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, విజయనగరం జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, ఒబెరాయ్, మై ఫెయిర్ హోటళ్ల ప్రతినిధులు, రెండు జిల్లాల ఆర్‌డీఓలు, పర్యాటక శాఖ ఆర్‌డీ జగదీశ్, జిల్లా పర్యాటక శాఖ అధికారిణి మాధవి, ఈపీడీసీఎల్ ఎస్‌ఈ శ్యాంబాబు, తదితరులు పాల్గొన్నారు.