Share News

పర్యాటక ప్రగతి అంతంతే!

ABN , Publish Date - Sep 27 , 2025 | 12:34 AM

జిల్లాలో పర్యాటక అభివృద్ధి ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్నట్టుగా వుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పర్యాటక అభివృద్ధికి అధిక ప్రాఽధాన్యం ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఏడాది దాటినా ప్రతిపాదనలు కార్యరూపం దాల్పలేదు. నిధుల కొరత, పరిపాలనా పరమైన అడ్డంకుల కారణంగా ఆశించిన స్థాయిలో పర్యాటక అభివృద్ధి జరగడం లేదు. శనివారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాలో పర్యాటక ప్రదేశాల స్థితిగతులపై ప్రత్యేక కథనం.

పర్యాటక ప్రగతి అంతంతే!
అభివృద్ధికి నోచుకోని తంతడి బీచ్‌

కాగితాలకే పరిమితమవుతున్న ప్రతిపాదనలు

కనీస సదుపాయాలకు నోచుకోని సాగర తీర ప్రాంతాలు

బొజ్జన్నకొండ అభివృద్ధికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వని కేంద్రం

కార్యరూపం దాల్చని కొండకర్ల ఆవ అభివృద్ధి

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో పర్యాటక అభివృద్ధి ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్నట్టుగా వుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పర్యాటక అభివృద్ధికి అధిక ప్రాఽధాన్యం ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఏడాది దాటినా ప్రతిపాదనలు కార్యరూపం దాల్పలేదు. నిధుల కొరత, పరిపాలనా పరమైన అడ్డంకుల కారణంగా ఆశించిన స్థాయిలో పర్యాటక అభివృద్ధి జరగడం లేదు. శనివారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాలో పర్యాటక ప్రదేశాల స్థితిగతులపై ప్రత్యేక కథనం.

జిల్లాలో సుదీర్ఘ సాగర తీరం, రాష్ట్రంలో రెండో అతిపెద్ద మంచినీటి సరస్సుగా గుర్తింపు పొందిన కొండకర్ల/ వాడ్రాపల్లి ఆవ, ప్రసిద్ధి చెందిన పురాతన పుణ్యక్షేత్రాలు, అనకాపల్లి సమీపంలో బౌద్ధ ఆరామం, కృష్ణాదేవిపేటలో అల్లూరి స్మారక ప్రదేశం, పలు జలాశయాలు వున్నాయి. తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో వున్నప్పుడు ఆయా ప్రదేశాలను పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా కొంతమేర అభివృద్ధి చేసింది. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. ఐదేళ్ల కాలంలో పర్యాటక ప్రదేశాలు, సందర్శనీయ స్థలాల నిర్వహణ, అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేదు. దీంతో ఆయా ప్రాంతాలు అధ్వానంగా తయారయ్యాయి.

ప్రతిపాదనల్లోనే బొజ్జన్నకొండ అభివృద్ధి

ప్రముఖ బౌద్ధ క్షేత్రం బొజ్జన్నకొండను పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలోనే రూ.7 కోట్లు మంజూరు చేసింది. కానీ అప్పట్లో అధికారంలో వున్న వైసీపీ పాలకులు ఈ నిధులను సద్వినియోగం చేయలేదు. రూ.కోటి వ్యయంతో నిర్మించిన ఎమినిటీ సెంటర్‌ భవనాన్ని అందుబాటులోకి తీసుకురాలేదు. కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో వున్న బొజ్జన్న కొండను సందర్శించడానికి నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. కొండపైన, గుహలోపల శిల్ప సంపద, బుద్ధుని విగ్రహాలు, ఽధ్యాన మందిరాలు, పెద్ద పెద్ద ఇటుకలతో కట్టిన ధ్యాన ప్రదేశాలు వున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత బొజ్జన కొండను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. కానీ ఇంతవరకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించలేదు. పరిపాలన పరమైన ఆమోదం లభించగానే అభివృద్ధి పనులు చేపడతామని అధికారులు చెబుతున్నారు.

కళ తప్పిన సముద్ర తీర ప్రాంతాలు

జిల్లాలో పరవాడ మండలం నుంచి పాయకరావుపేట మండలం వరకు సుమారు 80 కిలోమీటర్ల మేర సముద్ర తీరం వుంది. తిక్కవానిపాలెం, ముత్యాలమ్మపాలెం, వాడపాలెం (తంతడి), పూడిమడక, సీతపాలెం, రాంబిల్లి, కొత్తపట్నం, బంగారమ్మపాలెం, రేవుపోలవరం, రాజయ్యపేట, పెంటకోట, రాజవరం ప్రాంతాలకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. కార్తీక పౌర్ణమి, శివరాత్రి పర్వదినాల్లో ఈ ప్రాంతాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. ముత్యాలమ్మపాలెం, తంతడి, పూడిమడక, రేవుపోలవరం ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతుంటాయి. కానీ ఒక్కచోట కూడా తాగునీరు, మరుగుదొడ్లు, సేద తీరేందుకు నీడ వంటి కనీస సదుపాయాలు లేవు. సముద్ర తీరంలో మొత్తం 35 ప్రదేశాలను గుర్తించిన అధికారులు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని భావించారు. కానీ ఇంతవరకు కార్యరూపం దాల్పలేదు.

కొండకర్ల ఆవ.

కొండకర్ల ఆవ సహజసిద్ధ అందాలకు నిలయం. సుమారు 1800 ఎకరాల్లో విస్తరించి వున్న ఈ ఆవ.. రాష్ట్రంలో కొల్లేరు తరువాత అతిపెద్ద మంచినీటి సరస్సుగా ప్రసిద్ధి చెందింది. శీతాకాలంలో ఇక్కడకు వివిధ దేశాల నుంచి రకరాల పక్షులు వస్తుంటాయి. ఆవ అందాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ కూడా సదుపాయాలు అంతంతమాత్రంగానే వున్నాయి. ఆవలో విహరించడానికి అరకొరగా నాటు పడవలు మాత్రమే వున్నాయి. కొండకర్ల ఆవ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ కార్యరూపం దాల్చడంలేదు.

Updated Date - Sep 27 , 2025 | 12:34 AM