పర్యాటకం, ఐటీ, విద్యా రంగం...
ABN , Publish Date - Jul 06 , 2025 | 01:10 AM
విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా ఏడాది పూర్తిచేసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు.

ఈ మూడింటిపై రానున్న ఏడాది కాలంలో ప్రధాన దృష్టి
మూడేళ్లలో పది పెద్ద హోటళ్ల నిర్మాణం
ఐటీ సంస్థలకు భూమి సిద్ధం
ఈ ఏడాదిలోనే టీసీఎస్ కార్యకలాపాలు
తొలిదశలో 2,000 మంది ఉద్యోగులు
రెండు, మూడేళ్లలో 10,000 మంది...
భోగాపురం సమీపాన సివిల్ ఏవియేషన్ వర్సిటీ
2026 జూన్‌కల్లా మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం పూర్తి
నగరంలో కాలుష్యం తగ్గింపుపై దృష్టి
ఏడాదికి పది లక్షల మొక్కలు నాటతాం
‘యోగా’ కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు మరిచిపోలేని అనుభూతి
ఏడాదికాలం సంతృప్తికరంగా సాగింది
కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్
విశాఖపట్నం, జూలై 5 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా ఏడాది పూర్తిచేసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. ఏడాదికాలం సంతృప్తికరంగా సాగిందన్నారు. ఆయన కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకుని జూలై మూడో తేదీకి ఏడాది పూర్తయిన సందర్భంగా శనివారం విలేకరులతో మాట్లాడారు. అనుకున్న పనులు ఒకటి, రెండు చేయలేకపోయినా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు ప్రారంభం అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. రైల్వే జోన్ పనులు ప్రారంభం కావడం మంచి విషయమన్నారు. అలాగే మెట్రో రైలు ప్రాజెక్టు కోసం డీపీఆర్ రూపొందించి ప్రభుత్వానికి పంపామన్నారు. భూసేకరణ చురుగ్గా సాగుతుందన్నారు. ఏడాదిలో రెండుసార్లు నగరంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన పర్యటనలు విజయవంతమయ్యాయన్నారు. ప్రధాని పాల్గొన్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా గిన్నిస్ రికార్డు సాధించడం మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందన్నారు. లక్షల మంది పాల్గొనే కార్యక్రమం విజయవంతం అయ్యేంత వరకూ కొంత టెన్షన్, భయం కలిగాయని, అయితే నగర ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల సహకారంతో సజావుగా సాగి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. నగరానికి కొత్తగా వచ్చిన డబుల్ డెక్కర్ బస్సులు వారం, పది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.
వచ్చే ఏడాదిలో ప్రధానంగా మూడు రంగాలపై దృష్టిసారించనున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. ఉపాధి అవకాశాలు విస్తృతం చేయడం ద్వారా ఆర్థికాభివృద్ధి జరగాలంటే పర్యాటకం, ఐటీ, విద్యా రంగాల్లో కొత్త ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంటుందన్నారు. పర్యాటకానికి సంబంధించి అతిథ్య రంగం విస్తరణకు రానున్న రెండు, మూడేళ్లలో నగరంలో పేరున్న పది హోటళ్లు నెలకొల్పేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే వరుణ్‌బీచ్, అన్నవరంలో ఒబెరాయ్ హోటళ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా మే ఫ్రంట్ హోటల్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు. దీనివల్ల యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అదేవిధంగా దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు నగరానికి రావడంతో వ్యాపారాలు పెరుగుతాయని తద్వారా ఆర్థిక వృద్ధి పెరుగుతుందన్నారు. విశాఖను ఐటీ నగరంగా అభివృద్ధి చేయడానికి కృషిచేస్తామన్నారు. కొత్త సంస్థలను ఆహ్వానించి భూములు కేటాయిస్తామన్నారు. ఇందుకు అవసరమైన భూసేకరణ చేపట్టామన్నారు. టీసీఎస్ ఈ ఏడాదిలోనే విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్నదని, తొలిదశలో రెండు వేల మందిని నియమించుకుంటుందన్నారు. రానున్న రెండు, మూడేళ్లలో పది వేల మందితో కార్యకలాపాలు విస్తరించనున్నదని తెలిపారు. మరికొన్ని ఐటీ సంస్థలు విశాఖ కేంద్రంగా సేవలు అందించడానికి ముందుకువస్తున్నాయన్నారు. పర్యాటకం, ఐటీ రంగాలు, ఇతర రంగాలు ఏర్పాటుకావాలంటే అక్కడ పనిచేయడానికి అవసరమైన నిపుణులు అవసరమని పేర్కొన్నారు. దీనికోసం విద్యా రంగంపై ఫోకస్ పెట్టామన్నారు. భోగాపురం సమీపాన సివిల్ ఏవియేషన్ వర్సిటీ రానున్నదని సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా ప్రకటించారని పేర్కొన్నారు. టెక్నాలజీ రంగంలో పేరున్న విద్యా సంస్థలు విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వస్తున్నాయని, వీరి కోసం భూమి సిద్ధం చేశామన్నారు.
విశాఖ అభివృద్ధి కోసం ఎంతో కీలకమైన మాస్టర్‌ప్లాన్ రోడ్లు వీఎంఆర్‌డీఎ ద్వారా నిర్మిస్తున్నామని అన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు 45 నుంచి 50 నిమిషాలలో చేరుకునేందుకు పలు రోడ్లను 2026 జూన్‌కల్లా పూర్తిచేసే బాధ్యతను తాను తీసుకుంటున్నట్టు ప్రకటించారు. షీలానగర్ నుంచి సబ్బవరం వరకు జాతీయ రహదారి నిర్మాణం చేపడతామన్నారు. మౌలిక వసతులు పెరిగితే ఆర్ధిక కార్యకలాపాలు పెరుగుతాయని తద్వారా ఆదాయం వృద్ధి చెందుతుందన్నారు. ఈ ఏడాది నగరంలో కాలుష్యం తగ్గింపునకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతం నగరంలో 29 శాతం పచ్చదనం ఉండగా, వచ్చే మూడేళ్లలో 33 శాతానికి పెంచుతామన్నారు. ప్రస్తుత ఏడాది ఐదారు లక్షలు, వచ్చే ఏడాది నుంచి ఏటా పది లక్షలు మొక్కలు నాటుతామన్నారు. నగరం నుంచి భీమిలి వరకూ తీరంలో కోత నివారణకు వీఎంఆర్‌డీఎ ద్వారా ప్రాజెక్టులు త్వరలో చేపట్టనున్నట్టు వెల్లడించారు. కేంద్రం నగరంలో దివ్యాంగులకు స్టేడియం మంజూరుచేసిందన్నారు. నగరంలో అన్ని క్రీడా మైదానాలు, స్టేడియాలను పూర్తిగా వినియోగంలోకి తీసుకురావడం ద్వారా విద్యార్థులు, యువత మానసిక, శారీరక దారుఢ్యం పెంపొందించేకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి మత్తు నుంచి యువతను దూరం చేయడానికి క్రీడలు ప్రధాన సాధనమని కలెక్టర్ తెలిపారు.