ప్రజా ప్రయోజనకరంగా పర్యాటకాభివృద్ధి
ABN , Publish Date - Oct 22 , 2025 | 11:18 PM
స్థానిక ప్రజలకు ప్రయోజనం చేకూరేలా పాడేరు మండలం వంజంగి, అరకులోయ మండలం మాడగడ కొండల్లో పర్యాటకాభివృద్ధికి చర్యలు చేపడతామని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ తెలిపారు.
కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ వెల్లడి
వంజంగి, మాడగడ ప్రాంతాల స్థానికులు, అటవీ, ఐటీడీఏ అధికారుల సమన్వయంతోనే పనులు చేపడతామని స్పష్టీకరణ
పాడేరు, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రజలకు ప్రయోజనం చేకూరేలా పాడేరు మండలం వంజంగి, అరకులోయ మండలం మాడగడ కొండల్లో పర్యాటకాభివృద్ధికి చర్యలు చేపడతామని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ తెలిపారు. వంజంగి, మాడగడ ప్రాంతాలకు చెందిన వారితో బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత వంజంగి హిల్స్ గురించి ప్రస్తావిస్తూ... వాటి పరిధిలోకి వచ్చే వంజంగి, లగిశపల్లి, కాడెలి పంచాయతీలకు చెందిన ప్రజలకు సంపూర్ణ ప్రయోజనం కలిగేలా పర్యాటకాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు. అలాగే మాడగడ పంచాయతీకి చెందిన ప్రజలతో పాటు ముందు ఉన్న పకనగూడ గ్రామస్థులకు లబ్ధి చేకూరేలా చర్యలు చేపడతామన్నారు. ఆ రెండు ప్రాంతాలు రిజర్వు ఫారెస్ట్‌కు చెందినవి కావడం వల్లే ఆయా ప్రాంత ప్రజల అభిప్రాయాలకు విలువనిస్తూ, వారి అభిప్రాయాలకు అనుగుణంగా పర్యాటకాభివృద్ధికి చర్యలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. అటవీ, రెవెన్యూ శాఖల సమన్వయంతో వన సంరక్షణ సమితుల ప్రతినిధులు, స్థానికుల సహకారంతో కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తారన్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు వ్యక్తిగతంగా, సామాజికంగా లబ్ధి చేకూరేలా చర్యలు చేపట్టాలనే ఆలోచనతో జిల్లా యంత్రాంగం ఉందని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆయా కార్యక్రమాలు అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టడం ద్వారా పర్యావరణానికి ఎటువంటి హాని కలగదన్నారు. వంజంగి, మాడగడ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులు, ప్రభుత్వ శాఖల సమన్వయం, భాగస్వామ్యంతోనే ఎటువంటి చర్యలనైనా చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖాధికారి పీవీ సందీప్‌రెడ్డి, ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఆర్‌డీవో ఎంవీఎస్ లోకేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, వంజంగి, మాడగడ ప్రాంతాలకు చెందిన గిరిజనులు, పలు సంఘాలు, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.