కుండపోతగా వాన
ABN , Publish Date - Sep 23 , 2025 | 01:36 AM
జిల్లాలోని చోడవరం, నర్సీపట్నం, పాయకరావుపేట, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో సోమవారం మధ్యాహ్నం తరువాత భారీ వర్షం కురిసింది.
పలు మండలాల్లో గంట నుంచి మూడు గంటలపాటు భారీ వర్షం
పొంగి ప్రవహించిన గెడ్డలు, వాగులు
వరి, చెరకు, కూరగాయ పంటలకు మేలు
రావికమతం/ కోటవురట్ల/ కృష్ణాదేవిపేట, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని చోడవరం, నర్సీపట్నం, పాయకరావుపేట, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో సోమవారం మధ్యాహ్నం తరువాత భారీ వర్షం కురిసింది. కుండపోతగా కురిసిన వర్షంతో పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అంతకుముందు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీక్షణంగా కాయడంతోపాటు గాలి వీయకపోవడంతో ఉక్కపోతతో జనం ఇబ్బంది పడ్డారు. తరువాత వాతావరణం మారిపోయి ఆకాశం మేఘావృతమైంది. రావికమతం మండలంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. గెడ్డలు, వాగులు పొంగి ప్రవహించాయి. చెరువులు పూర్తిగా నిండిపోయి అలుగులు పారాయి. వరి, చెరకు, సరుగుడు, జీడిమామిడి తోటలకు ఈ వర్షం మేలు చేస్తుందని రైతులు చెబుతున్నారు.
గొలుగొండ మండలం ఏఎల్‌పురం, కొంగశింగి, సీహెచ్.నాగాపురం, లింగంపేట, గింజర్తి, పాతకృష్ణాదేవిపేట తదితర గ్రామాల్లో సోమవారం భారీ వర్షం పడింది. బోడ్డేరు గెడ్డలో నీటి ప్రవాహం పెరిగింది. చెరువులు ఇప్పటికే నిండాయి. వర్షంకారణంగా కృష్ణాదేవిపేట వారపుసంతలో వ్యాపారాలు సాగలేదు.
కోటవురట్ల మండలంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటలపాటు భారీవర్షం కురిసింది. గెడ్డలు వాగుల్లో వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించింది. వరి, చెరకు, కూరగాయ పండలకు వర్షం ఉపయోగపడుతుందని రైతులు ఆశాభావం వ్యక్త చేశారు.