Share News

రహదారి కోసం కలిసికట్టుగా..

ABN , Publish Date - Jun 04 , 2025 | 11:36 PM

అధ్వానంగా ఉన్న రహదారిని గిరిజనులు శ్రమదానంతో బాగు చేసుకున్నారు. రాకపోకలకు వీలుగా మార్గం ఏర్పాటు చేసుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నా స్పందించకపోవడంతో బైతినిలంక, గొలుగొండ గ్రామాలకు చెందిన గిరిజనులు బుధవారం రాసగుప్ప- గొలుగొండ రహదారిని చదును చేసుకున్నారు.

రహదారి కోసం కలిసికట్టుగా..
రాసగుప్ప- గొలుగొండ రోడ్డును శ్రమదానంతో బాగు చేసుకుంటున్న గిరిజనులు

అధ్వానంగా ఉన్న రోడ్డును శ్రమదానంతో బాగు చేసుకున్న గిరిజనులు

ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన

పెదబయలు, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): అధ్వానంగా ఉన్న రహదారిని గిరిజనులు శ్రమదానంతో బాగు చేసుకున్నారు. రాకపోకలకు వీలుగా మార్గం ఏర్పాటు చేసుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నా స్పందించకపోవడంతో బైతినిలంక, గొలుగొండ గ్రామాలకు చెందిన గిరిజనులు బుధవారం రాసగుప్ప- గొలుగొండ రహదారిని చదును చేసుకున్నారు.

పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీలోని రాసగుప్ప నుంచి బైతినిలంక, బూర్గుబందా, గొలుగొండ గ్రామాలకు వెళ్లే మూడు కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తిగా రాళ్లు తేలి అధ్వానంగా ఉంది. రెండు దశాబ్దాలుగా రహదారి ఘోరంగా ఉన్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోలేదు. దీంతో బైతినిలంక, గొలుగొండ గ్రామాలకు చెందిన గిరిజనులు బుధవారం శ్రమదానంతో రహదారిని బాగు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2007 సంవత్సరంలో రాసగుప్ప నుంచి గొలుగొండ గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణం జరిగిందన్నారు. ఆ సమయంలో కాంట్రాక్టర్‌ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఐదేళ్లకే రోడ్డు గోతులమయంగా మారిందన్నారు. అప్పటి నుంచి ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. ఏటా వర్షాకాలం ముందు ఇలా శ్రమదానంతో రోడ్డును బాగు చేసుకుంటున్నామని, వర్షాలు కురిస్తే రోడ్డు కోతకు గురై అధ్వానంగా తయారవుతుందన్నారు. నాలుగు గ్రామాలకు కనీసం ఫీడర్‌ అంబులెన్స్‌ కూడా రాలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రోగులు, గర్భిణులను ఆస్పత్రికి తరలించడానికి అవస్థలు పడుతున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రహదారిని నిర్మించాలని కోరారు. ఈ శ్రమదానంలో స్థానిక సర్పంచ్‌ చిన్నారావు, బైతినిలంక, గొలుగొండ గ్రామాల గిరిజనులు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 11:36 PM