Share News

నేడు స్ర్తీశక్తికి శ్రీకారం

ABN , Publish Date - Aug 15 , 2025 | 01:28 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘స్త్రీశక్తి’ పథకం (ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సదుపాయం) జిల్లాలో శుక్రవారం ప్రారంభం కానుంది.

నేడు స్ర్తీశక్తికి శ్రీకారం

  • ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఉచితం

  • సాయంత్రం 4.00 గంటలకు మద్దిలపాలెం డిపో, 5.30 గంటలకు మధురవాడ, వాల్తేరు, విశాఖపట్నం, గాజువాక, స్టీల్‌ సిటీ, సింహాచలం డిపోల నుంచి ఐదేసి బస్సులు ప్రారంభం

  • శనివారం నుంచి పూర్తిస్థాయిలో ఉచిత రవాణా సదుపాయం

  • ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు

ద్వారకా బస్‌స్టేషన్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘స్త్రీశక్తి’ పథకం (ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సదుపాయం) జిల్లాలో శుక్రవారం ప్రారంభం కానుంది. రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ సాయంత్రం 4.00 గంటలకు మద్దిలపాలెం డిపోలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ ఎం.శ్రీభరత్‌, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పీజీవీఆర్‌ నాయుడు, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అనంతరం 5.30 గంటలకు మధురవాడ, వాల్తేరు, విశాఖపట్నం, గాజువాక, స్టీల్‌ సిటీ, సింహాచలం డిపోల్లో స్థానిక ఎమ్మెల్యేలు స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభిస్తారు.

స్ర్తీశక్తి ప్రారంభోత్సవానికి సంబంధించి అర్డినరీ, పల్లె వెలుగు, ఆలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులను ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు. ప్రతి డిపోలోను ఐదేసి బస్సులను ప్రారంభించాలని నిర్ణయించారు. ఇటీవల ఆర్టీసీలో చేరిన కొత్తబస్సులకు మరిన్ని హంగులు సమకూర్చారు. ఉచిత బస్సులు శనివారం ఉదయం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నట్టు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

ఉచిత ప్రయాణానికి జీరో ఫేర్‌ టికెట్‌ ఇచ్చేందుకు టికెట్‌ ఇష్యూయింగ్‌ మెషీన్‌లు (టిమ్స్‌) అందుబాటులోకి వచ్చేశాయి. ఆర్టీసీ విశాఖ రీజియన్‌లోని ఆర్డీనరీ, పల్లెవెలుగు, ఆలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లకు సంబంధించిన అన్ని టిమ్స్‌కు ఈ సాఫ్ట్‌వేర్‌ను లోడ్‌ చేశారు. ఈ బస్సుల్లో ప్రయాణించే పురుషులకు వారు ప్రయాణించే దూరం ఆధారంగా నిర్దేశించిన మేరకు టికెట్లు జారీ చేస్తారు. మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణించినా జీరో టికెట్లు ఇస్తారు.

దూర ప్రాంతాలకు...

సీ్త్రశక్తి పథకం ద్వారా మహిళలు ఉచితంగా వివిధ రూట్లలో దూర ప్రాంతాలకు కూడా రాకపోకలు సాగించవచ్చు. విశాఖ నుంచి విజయవాడకు మూడు ఎక్స్‌ప్రెస్‌లు, రాజమండ్రికి గంటన్నరకొకటి చొప్పున ఎక్స్‌ప్రెస్‌/మెట్రో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు ఉన్నాయి. కాకినాడకు రెండు గంటలకొక ఎక్స్‌ప్రెస్‌/మెట్రో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు ఉన్నాయి. విజయనగరం, బొబ్బిలి, సాలూరు ప్రాంతాలకు గంటకొకటి, శ్రీకాకుళం, రాజాం, పాతపట్నం, టెక్కలి, సోంపేట ప్రాంతాలకు అరగంటకొకటి చొప్పున ఆర్డినరీ, పల్లెవెలుగు, ఆలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు ఉన్నాయి. వీటిలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు

ఘాట్‌ రోడ్లలో పథకం వర్తించదు

ఘాట్‌రోడ్లలో రాకపోకలు సాగించే బస్సుల్లో మాత్రం స్ర్తీశకి ్త పథకం వర్తించదు. ఘాట్‌ రోడ్లలో తిరిగే బస్సుల్లో నిర్దేశించిన మేరకే ప్రయాణికులను అనుమతిస్తారు. దాదాపు వాటిని సీటింగ్‌ కెపాసిటీతోనే ఆపరేట్‌ చేశారు. ఉచిత ప్రయాణం అనేసరికి మహిళలు ఘాట్‌ రోడ్డు బస్సుల్లో వాటి సామర్థ్యానికి మించి ఎక్కే అవకాశం ఉంది. అందువల్ల బస్సులు అధిక లోడ్‌తో ఘాట్‌ రోడ్డులో ప్రయాణించడం సరికాదని గుర్తించిన ఆర్టీసీ తాత్కాలికంగా ఆ రూట్లలో స్త్రీశక్తి పథకం అమలు నుంచి మినహాయించింది. విశాఖ రీజియన్‌ లో సింహాచలం, యారాడ, కైలాసగిరి ఉన్నాయి. ఈ రూట్లలో తిరిగే బస్సులకు స్త్రీశక్తి పథకం వర్తించదు. అలాగే విశాఖ నుంచి పాడేరు, భద్రాచలం, అరకు రాకపోకలు సాగించే బస్సులకు కూడా స్త్రీశక్తి పథకం వర్తించదు. మహిళలైనా సరే టికెట్‌ తీసుకోవలసిందే.

Updated Date - Aug 15 , 2025 | 01:28 AM