Share News

నేడే బడి పండుగ

ABN , Publish Date - Jul 09 , 2025 | 11:56 PM

విద్యారంగ సంస్కరణల్లో భాగంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య సమన్వయం, సహకారంతో పాఠశాల అభివృద్ధికి దోహదపడేలా మెగా పేరెంట్‌, టీచర్స్‌ మీట్‌(పీటీఎం)ను గురువారం జిల్లాలో ప్రతి విద్యాలయంలోనూ నిర్వహించనున్నారు.

నేడే బడి పండుగ
పాడేరు మండలం గుత్తులపుట్టులో మెగా పీటీఎంలో భాగంగా ఫొటో బూత్‌లను సిద్ధం చేస్తున్న బాలికలు

జిల్లా వ్యాప్తంగా 2,904 పాఠశాలల్లో మెగా పీటీఎం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

పాడేరు మండలం గుత్తులపుట్టులో జిల్లా స్థాయి వేడుక

పాడేరు, జూలై 9(ఆంధ్రజ్యోతి): విద్యారంగ సంస్కరణల్లో భాగంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య సమన్వయం, సహకారంతో పాఠశాల అభివృద్ధికి దోహదపడేలా మెగా పేరెంట్‌, టీచర్స్‌ మీట్‌(పీటీఎం)ను గురువారం జిల్లాలో ప్రతి విద్యాలయంలోనూ నిర్వహించనున్నారు. జిల్లాలో 22 మండలాల్లోని 2,904 విద్యాలయాల్లో మెగా పీటీఎం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా మండలంలో గుత్తులపుట్టు గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో జిల్లా స్థాయి మెగా పీటీఎం వేడుకను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఉపాధ్యాయులు, విద్యార్థులు చేస్తుండగా సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్‌ ఎ.స్వామినాయుడు, గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్‌ ఎల్‌.రజని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అలాగే మెగా పీటీఎంలో భాగంగా విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యాకిట్ల పంపిణీ, విద్యార్థుల స్థితిగతులను తెలిపే హొలిస్టిక్‌ ప్రోగ్రెస్‌కార్డులను తల్లిదండ్రులకు అందిస్తారు. పాఠశాల అభివృద్ధి, ఇతర విద్యాంశాలను చర్చిస్తారు. విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అతిథులు సహపంక్తి భోజనాలు చేస్తారు. వివిధ వినోద, క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తారు. మెగా పీటీఎం నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పాఠశాల నిర్వహణకు అందించే నిధుల్లో 20 శాతం సొమ్మును మెగా పేరెంట్‌ టీచర్స్‌ మీట్‌కు వినియోగించుకులా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలలకు కేటాయించిన నిర్వహణ నిధుల్లో 50 శాతం సొమ్మును ఇప్పటికే పాఠశాలల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. దీంతో వాటిలోని 20 శాతం సొమ్మును డ్రా చేసి మెగా పీటీ ఎంకు వినియోగిస్తారు.

Updated Date - Jul 09 , 2025 | 11:56 PM