Share News

నేడే పద్మనాభుడి దీపోత్సవం

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:55 AM

అనంత పద్మనాభస్వామి దీపోత్సవాన్ని బుధవారం సాయంత్రం నిర్వహించనున్నారు.

నేడే పద్మనాభుడి దీపోత్సవం

పద్మనాభం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి):

అనంత పద్మనాభస్వామి దీపోత్సవాన్ని బుధవారం సాయంత్రం నిర్వహించనున్నారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. కొండపై ఆలయం వద్ద, ఉత్సవ విగ్రహాలు నిలిపే మెట్ల మార్గం వద్ద, కుంతీమాధవస్వామి ఆలయం, నారాయణేశ్వరస్వామి ఆలయం వద్ద క్యూ లైన్లను ఏర్పాటుచేశారు. కొండ మెట్లకు ఇరువైపులా నూనె దీపాలను ఒకేసారి వెలిగించడం ఈ ఉత్సవం ప్రత్యేకత. దీపాలను వెలిగించడానికి భక్తులు మధ్యాహ్నం నుంచి మెట్లను రిజర్వు చేసుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు కొండపై జేగంట కొట్టగానే, మెట్లపై ఏర్పాటుచేసిన నూనె దీపాలను భక్తులు వెలిగిస్తారు. ఉత్సవ నేపథ్యంలో ఆలయాలతో పాటు రోడ్డుకు ఇరువైపులా విద్యుద్దీపాలతో అలకరించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ అన్నపూర్ణదేవి మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు.

18 ప్రత్యేక బస్సులు

పద్మనాభంలోని అనంత పద్మనాభస్వామి వారి ఆలయానికి బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ 18 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ఆర్టీసీ విశాఖ రీజనల్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు తెలిపారు. సింహాచలం కాంప్లెక్స్‌ నుంచి 12, తగరపువలస నుంచి 6 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.


పందలపాకలో ప్రభుత్వ భూమి ఆక్రమణ

తమ భూముల కోసం దర్జాగా రోడ్డు నిర్మించుకున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు

విశాఖపట్నం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి):

ఆనందపురం మండలం పందలపాకలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్రభుత్వ భూమిని ఆక్రమించి రోడ్డు నిర్మించారు. ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేటు భూమి కూడా ఆక్రమించారని తహశీల్దార్‌కు, స్థానిక పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అధికారులు విచారణ జరుపుతున్నారు. పందలపాకలో కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొనుగోలు చేసిన భూమికి రహదారి లేకుండా పోయింది. దీంతో వారి భూమి ముందు సర్వే నంబరు 52-1లో గల గెడ్డ పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి దర్జాగా రోడ్డు నిర్మించారు. ఇందుకోసం ప్రభుత్వ భూమితో పాటు కొంతమంది ప్రైవేటు వ్యక్తుల స్థలాన్ని కూడా ఆక్రమించుకున్నారు. దీనిపై స్థానికులు, వీఆర్వో చేసిన ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెనుకాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.


మద్యం తాగాలని వేధిస్తున్నారు!

డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు

సీనియర్లపై కలెక్టర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ సమక్షంలో

వీసీకి ఫిర్యాదు చేసిన ఏయూ విద్యార్థి

విశాఖపట్నం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జూనియర్‌ విద్యార్థులను సీనియర్లు వేధిస్తున్నారు. మత్తు పదార్థాలు వినియోగించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ విషయాన్ని వేధింపులకు గురైన ఒక విద్యార్థి మంగళవారం జిల్లా కలెక్టర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ సమక్షంలో ఏయూ వైస్‌ చాన్సలర్‌ దృష్టికి తీసుకువచ్చారు. వివరాల్లోకి వెళితే...మాదకద్రవ్య రహిత సమాజ స్థాపన లక్ష్యంగా కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ‘నషా ముక్త అభియాన్‌’ ప్రారంభించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం ఏయూలోని వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుచేశారు. దీనిని వర్చువల్‌ విధానంలో లైవ్‌ స్ర్టీమింగ్‌ చేశారు. ఆడిటోరియంలో కార్యక్రమం ముగింపు సమయంలో ఒక విద్యార్థి లేచి మైక్‌ అందుకున్నాడు. అతని పేరు కౌశిక్‌ బిస్వాస్‌. బంగ్లాదేశ్‌కు చెందిన కౌశిక్‌ ప్రస్తుతం ఏయూలో బీబీఏ తొలి ఏడాది చదువుతున్నాడు. విదేశీ విద్యార్థులకు కేటాయించిన హాస్టల్‌లో ఉంటున్న తనను నెల రోజులుగా బంగ్లాదేశ్‌తోపాటు ఇతర దేశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు మద్యం తాగాలంటూ ఒత్తిడి చేస్తున్నారని వాపోయాడు. మద్యం తాగనని చెప్పినందుకు పలుమార్లు తనపై దాడి చేశారని, ఇదే విషయాన్ని విదేశీ వ్యవహారాల డీన్‌, ఇతర అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్టు వెల్లడించాడు. సదరు విద్యార్థులను అధికారులు హెచ్చరించినప్పటికీ ఫలితం లేదని, ఇప్పటికీ తనపై వేధింపులు ఆగలేదని, డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన ఏయూ వీసీ నెల రోజులు కిందట జరిగిన ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మత్తు పదార్థాలు, మద్యం వంటివి వర్సిటీకి దూరంగా ఉండేలా చేస్తామని స్పష్టం చేశారు.

Updated Date - Nov 19 , 2025 | 12:55 AM