నేడు మోదకొండమ్మ అనుపోత్సవం
ABN , Publish Date - May 13 , 2025 | 12:50 AM
మూడు రోజుల మోదకొండమ్మ ఉత్సవాల్లో భాగంగా ముగింపు రోజైన మంగళవారం అనుపోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి రోజు సతకంపట్టులో కొలువు తీరిన మోదకొండమ్మ భక్తుల పూజలు అందుకుంటున్నది.

ఘనంగా ఊరేగింపు నిర్వహించేందుకు ఏర్పాట్లు
ఆలయంలో అమ్మవారిని అనపడంతో ఉత్సవాలు ముగింపు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మూడు రోజుల మోదకొండమ్మ ఉత్సవాల్లో భాగంగా ముగింపు రోజైన మంగళవారం అనుపోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి రోజు సతకంపట్టులో కొలువు తీరిన మోదకొండమ్మ భక్తుల పూజలు అందుకుంటున్నది. ఉదయం, సాయంత్రం వేళల్లో అక్కడ డప్పుల మోతలతో అమ్మవారికి సేవలు అందిస్తున్నారు. తొలి రోజు ఆలయం నుంచి ఊరేగింపుగా సతకంపట్టులో కొలువు తీర్చిన అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలును అనుపోత్సవంలో భాగంగా తిరిగి ఆలయంలో అనుపు తీర్చే తంతును మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. తొలి రోజుకు మించి ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. రకరకాల నృత్యాలు, వేషాలు, డప్పుల వాయిద్యాల సందడి వాతావరణంలో ఉత్సవ మూర్తిని, పాదాలును ఊరేగిస్తారు. అనుపోత్సవం ముగిసిన తరువాత చేపట్టే బాణసంచా కాల్చివేత ఉత్సవాలకు ఓ ప్రత్యేకతగా ఉంటుంది. మంగళవారం రాత్రంతా భక్తులను అలరించేందుకు సినీ, టీవీ, జానపద సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రాత్రంతా ఆయా కార్యక్రమాలను తిలకించి బుధవారం నుంచి భక్తులు స్వస్థలాలకు తిరుగు ప్రయాణమవుతారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కె.కోటినాయుడు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఉత్సవ కమిటీ ప్రతినిధులు కె.సురేశ్‌కుమార్, కెజియారాణి, సల్లా రామకృష్ణ, టి.ప్రసాదరావునాయుడు, కె.ప్రశాంత్, కె.వెంకటరమణ, ఉత్సవ, ఆలయ కమిటీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.