Share News

తీరానికి.. తాటి కవచం!

ABN , Publish Date - Oct 13 , 2025 | 12:46 AM

బంగాళాఖాతంలో సంభవించే తుఫాన్‌ల సమయంలో తొలుత ప్రభావితమయ్యేది తీర ప్రాంతమే.

తీరానికి..  తాటి కవచం!

  • గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌ కాన్సెప్ట్‌ అమలుకు అటవీశాఖ ప్రణాళిక

  • ఉత్తరాంధ్ర పరిధిలో 2.5 లక్షల తాటిచెట్ల పెంపకం

  • సరుగుడు, ఇతర మొక్కలు నాటేందుకు నిర్ణయం

  • మడ అడవుల పెంపకానికి శ్రీకారం

  • తుఫాన్ల నుంచి రక్షణకు చర్యలు

విశాఖపట్నం, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి):

బంగాళాఖాతంలో సంభవించే తుఫాన్‌ల సమయంలో తొలుత ప్రభావితమయ్యేది తీర ప్రాంతమే. ఆ సమయంలో వీచే పెనుగాలుల ధాటికి అపార నష్టం వాటిల్లుతుంది. అలలు ఎగిసిపడి సమీప గ్రామాల్లోకి సముద్ర జలాలు చొరబడి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లు, భూములు, కమ్యూనికేషన్లు, విద్యుత్‌ స్తంభాలు, టవర్లు దెబ్బతింటాయి. తీరంపొడవునా కోత తీవ్రత ఎక్కువవుతుంది. దీంతో నగరంలోని బీచ్‌రోడ్డు నిత్యం కోతకు గురై నష్టం సంభవిస్తోంది. ఇలాంటి విపత్తుల నుంచి తీర ప్రాంతానికి రక్షణగా నిలిచేలా ‘గ్రేట్‌గ్రీన్‌వాల్‌’ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ప్రణాళిక రూపొందించి అమలుకు శ్రీకారం చుట్టింది.

ఐదేళ్లపాటు అమలుచేసే ‘గ్రేట్‌గ్రీన్‌వాల్‌ కార్యక్రమం’లో తీరానికి ఆనుకుని తొలి వరుసలో తాటిచెట్లు, రెండో వరుసలో సరుగుడు, ఆ తరువాత జీడి, అనువుగా ఉండే చోట మడ అడవుల పెంపునకు విశాఖ సర్కిల్‌ అటవీశాఖ కార్యాచరణ అమలుచేస్తోంది. సర్కిల్‌ పరిధిలోని ఇచ్ఛాపురం నుంచి పాయకరావుపేట వరకు 344 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. తీరం పొడవునా సుమారు ఎనిమిదివేల హెక్టార్ల అటవీశాఖ, దీనికి ఆనుకుని రెవెన్యూశాఖకు భూములు ఉన్నాయి. తీరం నుంచి భూ ఉపరితలం వైపు లోపలికి ఐదు కిలోమీటర్ల వెడల్పులో ‘’గ్రేట్‌గ్రీన్‌వాల్‌ కార్యక్రమం’ అమలుచేస్తారు. మొదటి వరుసలో తాటి వనాలు పెంచుతారు. ఇందుకుగాను విశాఖ సర్కిల్‌లో రెండున్నరలక్షల తాటిచెట్లు పెంచేందుకు టెంకలు సిద్ధంచేశారు. విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తాటి పొదల నుంచి వీటిని సేకరించారు. టెంకలను తీరం పొడవునా నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదేళ్లపాటు వీటిని నాటాలని ప్రణాళికలో పొందుపరిచారు.

తుఫాన్ల ధాటిని నిలువరించేలా..

తీరంలో ఉప్పుగాలులకు తట్టుకుని తాటిచెట్లు పెరుగుతాయి. సుమారు 40 నుంచి 50 అడుగుల ఎత్తు పెరుగుతాయి. తుఫాన్‌గాలులను నిలువరిస్తాయి. గతంలో దివిసీమ తుఫాన్‌ తరువాత కోస్తాతీరం వెంబడి భారీగా తాటి, సరుగుడు వనాలు పెంచారు. ఆ తరువాత రెండోవరుసలో సరుగుడు వనాలు పెంచనున్నారు. ఈ ఏడాది 20 లక్షల సరుగుడు మొక్కలు నాటాలని అటవీశాఖ నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి 30 నుంచి 40 లక్షల సరుగుడు మొక్కలు నాటుతారు. ఆ తరువాతి వరుసలో రైతుల భూముల్లో జీడితోటల పెంపకాన్ని ప్రోత్సహించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అనువుగా ఉండే చోట మడ అడవులు పెంచుతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే పలు పథకాల ద్వారా తాటి, సరుగుడు, మడ అడవులు పెంపకం చేపడతారు. కోస్తా తీరం మొత్తం ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు అమలుకు రూ.500 కోట్లు వెచ్చించనున్నారు.

కార్యాచరణ రూపొందించాం

‘’గ్రేట్‌గ్రీన్‌వాల్‌ కార్యక్రమం’ అమలుకు శాఖాపరంగా కార్యాచరణ రూపొందించామని విశాఖ సర్కిల్‌ కన్జర్వేటర్‌ బీఎం దివాన్‌ మైదీన్‌ తెలిపారు. ఈ పథకం వల్ల పెరగనున్న తాటి, సరుగుడు వనాల ద్వారా తీర ప్రాంతానికి రక్షణ లభిస్తుందన్నారు. గతంలోనూ తీరం పొడవునా వీటిని పెంచారని, మరోసారి తాటి, సరుగుడు వనాలు పెంచడం ద్వారా తీర ప్రాంతం కోత, తుఫాన్‌లు సంభవించేటప్పుడు వీచే పెనుగాలుల నుంచి రక్షణ లభిస్తుందన్నారు.

Updated Date - Oct 13 , 2025 | 12:46 AM