Share News

బడికి వెళ్లాలంటే వాగు దాటాల్సిందే..

ABN , Publish Date - Jun 27 , 2025 | 11:47 PM

మండలంలోని తాజంగి పంచాయతీ కరకపల్లి గిరిజన విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. ప్రతి రోజు వాగుదాటి, పొలాల గట్లపై రెండు కిలోమీటర్లు ప్రయాణించి గొడుగుమామిడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళుతున్నారు.

బడికి వెళ్లాలంటే వాగు దాటాల్సిందే..
వాగు దాటుతున్న విద్యార్థులు

కరకపల్లి విద్యార్థుల అవస్థలు

చింతపల్లి, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): మండలంలోని తాజంగి పంచాయతీ కరకపల్లి గిరిజన విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. ప్రతి రోజు వాగుదాటి, పొలాల గట్లపై రెండు కిలోమీటర్లు ప్రయాణించి గొడుగుమామిడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడం, గ్రామానికి సరైన రహదారి సదుపాయం లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరకపల్లి గ్రామంలో ఒకటి నుంచి ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు 15 మంది ఉన్నారు. గ్రామంలో పాఠశాల లేదు, బాలబాలికలు విద్యాభ్యాసానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గొడుగుమామిడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లాలి. కరపల్లి గ్రామానికి రహదారి సదుపాయం కల్పించాలని గత ఐదేళ్లుగా వైసీపీ ప్రజాప్రతినిధులు, అధికారులకు స్థానిక గిరిజనులు విన్నవించుకున్నప్పటికీ ఎవరూ స్పందించలేదు. దీంతో కరకపల్లి గిరిజనులకు రవాణా కష్టాలు తప్పడం లేదు. గ్రామానికి చెందిన విద్యార్థినీ, విద్యార్థులు ప్రతి రోజు పుస్తకాలతో పాటు గొడుగు పట్టుకుని పాఠశాలకు పొలాల గట్లపై నడిచి వెళ్లి, సాయంత్రం తిరిగి వస్తున్నారు. వర్షం అధికంగా కురిస్తే మార్గమధ్యంలోనున్న వాగు దాటడం కష్టమవుతుంది. దీంతో మరో మార్గంలో మూడున్నర కిలోమీటర్ల నడిచి విద్యార్థులు గ్రామానికి వెళుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కరకపల్లి గ్రామానికి రహదారి నిర్మించి విద్యార్థులు, గిరిజనులు ఎదుర్కొంటున్న రవాణా కష్టాలను తీర్చాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.

Updated Date - Jun 27 , 2025 | 11:47 PM