Share News

తిరుపతి రైళ్లు ఫుల్‌

ABN , Publish Date - Oct 23 , 2025 | 01:25 AM

తిరుపతి రైళ్లకు డిమాండ్‌ కొనసాగుతోంది. విశాఖ నుంచి ప్రతిరోజూ నడిచే విశాఖ-తిరుపతి/కడప తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (18521)లో డిసెంబరు 16 వరకూ అన్ని తరగతుల బెర్తులు ఇప్పటికే రిజర్వు అయిపోయాయి. తిరుమల ఎక్స్‌ప్రెస్‌కు ఏడాది పొడవునా డిమాండ్‌ ఉంటోంది. అలాగే విశాఖ మీదుగా రోజూ నడిచే హౌరా-యశ్వంతపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (12863)లో కూడా డిసెంబరు 16 వరకు బెర్తులు లభించే పరిస్థితి లేదు.

తిరుపతి రైళ్లు ఫుల్‌

తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో

డిసెంబరు 16 వరకూ బెర్తులు రిజర్వు

హౌరా-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లోనూ అదే పరిస్థితి

వారాంతపు రైళ్లకు తీవ్ర డిమాండ్‌

విశాఖ-తిరుపతి ప్రత్యేక రైలు,

డబుల్‌ డెక్కర్‌లో ఖాళీలు

విశాఖపట్నం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి):

తిరుపతి రైళ్లకు డిమాండ్‌ కొనసాగుతోంది. విశాఖ నుంచి ప్రతిరోజూ నడిచే విశాఖ-తిరుపతి/కడప తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (18521)లో డిసెంబరు 16 వరకూ అన్ని తరగతుల బెర్తులు ఇప్పటికే రిజర్వు అయిపోయాయి. తిరుమల ఎక్స్‌ప్రెస్‌కు ఏడాది పొడవునా డిమాండ్‌ ఉంటోంది. అలాగే విశాఖ మీదుగా రోజూ నడిచే హౌరా-యశ్వంతపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (12863)లో కూడా డిసెంబరు 16 వరకు బెర్తులు లభించే పరిస్థితి లేదు.

ప్రత్యేక రైలు, డబుల్‌ డెక్కర్‌లో ఖాళీలు

ప్రతి బుధవారం విశాఖ నుంచి తిరుపతికి నడుపుతున్న ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు (08547)లో ఈ నెల 29, నవంబరు 5, 12, 19, 26 తేదీల్లో బెర్తులు అందుబాటులో ఉన్నాయి. అలాగే మంగళ, గురు, శనివారాల్లో విశాఖ నుంచి బయలుదేరే డబుల్‌ డెక్కర్‌ (22707) ఎక్స్‌ప్రెస్‌లో సీట్లు ఖాళీ ఉన్నాయి. డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆక్యుపెన్సీ అంతంత మాత్రంగానే ఉంది. ఈ రైలు విశాఖ నుంచి బయలుదేరే సమయం (రాత్రి 11 గంటలకు)తోపాటు తిరుపతి చేరే సమయం (మధ్యాహ్నం 12.30 గంటలకు) అనుకూలంగా లేకపోవడం ఒక కారణమైతే, సుమారు 14 గంటలపాటు కూర్చొని ప్రయాణించాల్సి రావడంతో ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రతి సోమ, మంగళ, గురు, శుక్ర, శనివారాల్లో విశాఖ మీదుగా నడిచే పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ (17479), ప్రతి ఆది, బుధవారాల్లో అందుబాటులో ఉండే బిలాస్‌పూర్‌-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ (17481) రైళ్లకు నవంబరులో బెర్తులు లభించే పరిస్థితి ఉంది.

వారాంతపు, బైవీక్లీ రైళ్లకు తీవ్ర డిమాండ్‌

విశాఖ మీదుగా నడిచే వారాంతపు, బైవీక్లీ రైళ్లకు కూడా తీవ్ర డిమాండ్‌ ఏర్పడింది. ప్రతి శనివారం నడిచే భువనేశ్వర్‌-తిరుపతి (22879) ఎక్స్‌ప్రెస్‌కు డిసెంబరు 20 వరకు, అలాగే ప్రతి ఆదివారం భువనేశ్వర్‌లో బయలుదేరి విశాఖ మీదుగా తిరుపతి వెళ్లే భువనేశ్వర్‌-తిరుపతి (22871) ఎక్స్‌ప్రెస్‌కు డిసెంబరు 21 వరకు బెర్తులు నిండిపోయి నిరీక్షణ జాబితా ఏర్పడింది. ఖరగ్‌పూర్‌-విల్లుపురం (22603), సంత్రాగచ్చి-మంగళూరు వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ (22815), భగల్‌పూర్‌-బెంగళూరు అంగా ఎక్స్‌ప్రెస్‌ (12254), షాలిమార్‌-నాగర్‌కోయిల్‌ గురుదేవ్‌ ఎక్స్‌ప్రెస్‌ (12660). పురిలియా-విల్లుపురం (22605), హటియా-బెంగళూరు (18637), భువనేశ్వర్‌-బెంగళూరు (12845), హౌరా-తిరుపతి హంసఫర్‌ (20889), సంత్రాగచ్చి-తిరుపతి (22855), హౌరా-పాండిచ్చేరి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12867) రైళ్లకు తీవ్ర డిమాండ్‌ ఏర్పడింది.

షిర్డీ రైలుకు నవంబరు 20 వరకూ బెర్తులు ఫుల్‌

విశాఖ నుంచి ప్రతి గురువారం బయలుదేరే సాయినగర్‌ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ (18503)లో నవంబరు 20 వరకూ బెర్తులు రిజర్వు అయిపోయాయి. నవంబరు 27 నుంచి డిసెంబరు 18 వరకు బెర్తులు లభ్యమవుతున్నాయి. వారానికి ఒక్కరోజు మాత్రమే ఈ రైలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో షిర్డీ ఎక్స్‌ప్రెస్‌కు ఆక్యుపెన్సీ పెరుగుతోంది. షిర్డీ వెళ్లేవారికి ప్రత్యామ్నాయంగా విశాఖ-ఎల్‌టీటీ వయా సికింద్రాబాద్‌ (18519), విశాఖ-ఎల్‌టీటీ వయా రాయగడ (22847), కోణార్క్‌ (11020) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో మన్మాడ్‌ వరకు వెళ్లే అవకాశం ఉన్నా ఎక్కువగా సాయినగర్‌ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌కే ప్రాధాన్యమిస్తారు. ఈ నేపథ్యంలో షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ను బైవీక్లీగా నడపాలని డిమాండ్‌ చాలాకాలంగా ఉంది.

Updated Date - Oct 23 , 2025 | 01:25 AM