గడువులోగా అర్జీల పరిష్కారం
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:26 PM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో ప్రజలు అందజేసిన అర్జీల్లో పేర్కొన్న సమస్యలు, ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశం
అనకాపల్లి కలెక్టరేట్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో ప్రజలు అందజేసిన అర్జీల్లో పేర్కొన్న సమస్యలు, ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీడీఆర్‌ఎస్‌లో డీఆర్‌వో వై.సత్యనారాయణరావుతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మొత్తం 240 అర్జీలు అందాయని, వాటిని పరిష్కార నిమిత్తం ఆయా శాఖలకు పంపించామన్నారు. ఒక సమస్యపై కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేస్తే.. అదే సమస్యపై మరోసారి అర్జీ ఇవ్వాల్సిన అవసరం రాకుండా సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో..
అనకాపల్లి రూరల్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌లో అందించిన అర్జీలకు సంబంధించి ఫిర్యాదులు, సమస్యలకు సత్వర పరిష్కారం చూపుతామని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఆయన మాట్లాడుతూ, మొత్తం 55 ఫిర్యాదులు అందాయని, వీటిని నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామని చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయానికి రాలేని వారు ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చునని ఎస్పీ వెల్లడించారు.