సకాలంలో స్థానిక ఎన్నికలు
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:43 AM
స్థానిక సంస్థల పాలక వర్గాల కాలపరిమితి ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
పాలకవర్గాల కాలపరిమితి ముగిసిన వెంటనే నిర్వహిస్తాం
త్వరలో మిగిలిన నామినేటెడ్ పదవులు భర్తీ
పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయండి
నగర టీడీపీ నేతలతో మంత్రి లోకేశ్
డిప్యూటీ మేయర్-2పై అవిశ్వాసం పెట్టాలని సూచన
విశాఖపట్నం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి):
స్థానిక సంస్థల పాలక వర్గాల కాలపరిమితి ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో విజయం సాధించడానికి ప్రజా ప్రతినిధులు, నాయకులు ఇప్పటి నుంచే ప్రణాళికలు అమలు చేయాలని, ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ప్రజలు, పార్టీ శ్రేణులకు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. రెండు రోజుల నగర పర్యటనకు వచ్చిన ఆయన్ను శుక్రవారం ఉదయం జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఎంపీ ఎం.శ్రీభరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పి.గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు గండి బాబ్జీ, విశాఖ దక్షిణ ఇన్‌చార్జి సీతంరాజు సుధాకర్, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, తదితరులు పార్టీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రెండో డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయం ప్రస్తావనకు వచ్చింది. అవిశ్వాసం పెట్టి తన నియోజకవర్గంలో టీడీపీ కార్పొరేటర్‌కు అవకాశం ఇవ్వాలని ఒక ఎమ్మెల్యే కోరారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీలో పూర్తి పట్టు ఉన్నప్పటికీ రెండో డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసం ఎందుకు పెట్టలేదని నేతలను ప్రశ్నించారు. దీనిపై ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ కౌన్సిల్ పదవీకాలం కొద్దినెలలు మాత్రమే ఉందని, ఇటువంటప్పుడు అవిశ్వాసం ఎందుకని అనడంతో మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారని తెలిసింది. ఆ సమయంలోనే స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. ప్రభుత్వంలో ఇంకా మిగిలిన నామినేటెడ్ పదవులు పంపకం త్వరలో చేపడతామన్నారు. జీవీఎంసీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి లోకేశ్ పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన తరువాత ఇన్‌చార్జి మంత్రి నేతృత్వంలో సర్య్కూట్‌హౌస్‌లో ఎంపీ భరత్ తప్ప మిగిలిన వారంతా సమావేశమయ్యారు. రెండో డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసం, నామినేటెడ్ పదవుల పంపకం కోసం నివేదికలు తయారుచేయడం, నగరంలో ఇంటింటికీ 24 గంటల తాగునీరు, రోడ్లు, మురుగుకాల్వల నిర్మాణం, ఇతర పనులు వెంటనే పూర్తిచేసేలా జీవీఎంసీ అధికారులకు సూచించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా నగర మేయర్‌కు పలు సూచనలు చేశారు.
మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్
పలు సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చిన జనం
పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా
విశాఖపట్నం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఉదయం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. పలువురు ఇచ్చిన వినతులు పరిశీలించి ఆయా సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో వాడబలిజ మత్స్యకారులకు వలలు, బోట్లు ఇవ్వాలని, శిక్షణ కేంద్రాలు, పాఠశాలలు ఏర్పాటుచేయాలని సంబంధిత సంఘం ప్రతినిధులు కోరారు. రైలు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన తనకు ఉపాధి కల్పించాలని మింది ప్రాంతానికి చెందిన దాడి అవినాశ్, వినాయక ఉత్సవాల ఊరేగింపులో సౌండ్ సిస్టమ్‌ను అనుమతించాలని ఈవెంట్ మేనేజర్ల సంఘం ప్రతినిధులు కోరారు. రోడ్డు ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన తనను ఆర్థికంగా ఆదుకోవాలని ఎలమంచిలికి చెందిన గుడాల జీవన్‌కుమార్, డిగ్రీ చదివిన దివ్యాంగురాలైన తన కుమార్తెకు ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని విశాఖలోని 91వ వార్డుకు చెందిన పి.ఆదినారాయణ కోరగా మంత్రి భరోసా ఇచ్చారు.