Share News

గృహ లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు

ABN , Publish Date - Sep 04 , 2025 | 11:49 PM

పీఎం జన్‌మన్‌ గృహ నిర్మాణ లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నామని హౌసింగ్‌ ప్రాజెక్టు జిల్లా డైరెక్టర్‌ బి.బాబు నాయక్‌ తెలిపారు.

గృహ లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు
బైలుకించంగిలో నిర్మాణంలో ఉన్న పక్కా గృహాన్ని పరిశీలిస్తున్న పీడీ బాబు నాయక్‌

వచ్చే ఏడాది మార్చి 31తో ముగియనున్న పీఎం జన్‌మన్‌ గృహ నిర్మాణ పథకం

నిర్మాణాలు వేగవంతం చేయాలి

హౌసింగ్‌ పీడీ బాబు నాయక్‌

గూడెంకొత్తవీధి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): పీఎం జన్‌మన్‌ గృహ నిర్మాణ లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నామని హౌసింగ్‌ ప్రాజెక్టు జిల్లా డైరెక్టర్‌ బి.బాబు నాయక్‌ తెలిపారు. గురువారం చింతపల్లి, జీకేవీధి మండలాల్లో పర్యటించిన ఆయన నిర్మాణంలో ఉన్న పక్కా గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఆయన మాట్లాడుతూ పక్కా గృహాల నిర్మాణాలకు నిధుల కొరత లేదన్నారు. వివిధ స్థాయిలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు హౌసింగ్‌ అధికారులు రికార్డు చేసిన మూడు రోజుల్లో బిల్లులు వ్యక్తిగత ఖాతాలో జమ అవుతున్నాయన్నారు. పీఎం జన్‌మన్‌ పథకం 2026 మార్చి 31తో ముగుస్తుందన్నారు. ఈ పథకం సమయం ముగియక ముందుగానే లబ్ధిదారులు గృహాలను పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిర్మాణాలు ఆలస్యం చేస్తే పథకం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. లబ్ధిదారులందరూ వేగవంతంగా గృహాలను నిర్మించుకోవాలన్నారు. 2024-25 వార్షిక సంవత్సరంలో జిల్లాలో 38,801 పక్కా గృహాలు మంజూరయ్యాయన్నారు. 80 శాతం గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. మరో 20 శాతం గృహాల నిర్మాణాలు ప్రారంభించాల్సి వుందన్నారు. గృహాలు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి, జీకేవీధి హౌసింగ్‌ ఏఈ కె.రమణబాబు, సెగ్గె సూరిబాబు, వర్కు ఇన్‌స్పెక్టర్లు రాజారావు, చిట్టిపడాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 04 , 2025 | 11:49 PM