మావోల కదిలికలపై పటిష్ఠ నిఘా
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:50 AM
మావోయిస్టుల కదిలికలపై నిఘాను పటష్ఠం చేసి అప్రమత్తంగా ఉన్నామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి అన్నారు. మంగళవారం ఇక్కడకు వచ్చిన ఆయన డీఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విజయవాడలో మాదిరిగా ఉత్తరాంధ్రలోని పట్టణ ప్రాంతాల్లో మావోయిస్టులు తలదాచుకునే అవకాశం లేదని అన్నారు.
ఉత్తరాంధ్రలో షెల్టర్లకు అవకాశం లేదు
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి
నర్సీపట్నం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టుల కదిలికలపై నిఘాను పటష్ఠం చేసి అప్రమత్తంగా ఉన్నామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి అన్నారు. మంగళవారం ఇక్కడకు వచ్చిన ఆయన డీఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విజయవాడలో మాదిరిగా ఉత్తరాంధ్రలోని పట్టణ ప్రాంతాల్లో మావోయిస్టులు తలదాచుకునే అవకాశం లేదని అన్నారు. నక్సలైట్లు/ మావోయిస్టుల ప్రభావం లేకపోతే ఏజెన్సీ ప్రాంతం మరింత అభివృద్ధిచెంది వుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. సైబర్ మోసాల విషయంలో ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని అని ఎవరైనా చెబితే నమ్మవద్దని అన్నారు. డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ నేరాలుకు పాల్పడుతున్నారని, అటువంటి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు, సైబర్ నేరాల టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని డీఐజీ సూచించారు. గంజాయి కేసుల్లో పట్టుబడిన నిందితులకు సంబంధించి 14 మందికి చెందిన ఆస్తులను సీజ్‌చేసినట్టు చెప్పారు. గంజాయి రవాణా కట్టడి కోసం ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, ఇన్‌ఫార్మర్లు, డ్రోన్లు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. ఆయన వెంట ఎస్పీ తుహిన్‌సిన్హా, డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు, ఎస్‌ఐలు వున్నారు.