చందనోత్సవానికి పటిష్ఠ ఏర్పాట్లు
ABN , Publish Date - Apr 11 , 2025 | 01:25 AM
ఈనెల 30వ తేదీన జరగనున్న సింహాచలం వరాహలక్ష్మీనరసింహస్వామి చందనోత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించేందుకు పటిష్ఠ ఏర్పాట్లుచేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ అధికారులను ఆదేశించారు. చందనోత్సవ ఏర్పాట్లపై పలు శాఖల అధికారులతో ఆయన గురువారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడండి
కలెక్టర్ హరేంధిరప్రసాద్ ఆదేశం
30న ఉత్సవం
29 సాయంత్రం 6 గంటల నుంచి సాధారణ దర్శనాలు నిలిపివేత
విశాఖపట్నం, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి):
ఈనెల 30వ తేదీన జరగనున్న సింహాచలం వరాహలక్ష్మీనరసింహస్వామి చందనోత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించేందుకు పటిష్ఠ ఏర్పాట్లుచేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ అధికారులను ఆదేశించారు. చందనోత్సవ ఏర్పాట్లపై పలు శాఖల అధికారులతో ఆయన గురువారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. టికెట్ల విక్రయం నుంచి వాహనాల నిర్వహణ వరకూ ప్రతి అంశాన్ని ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. 29వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి సాధారణ దర్శనాలు నిలిపివేయాలన్నారు. భక్తుల కోసం రూ.1000, రూ.300 టికెట్ల విక్రయాలను అనుకూల ప్రాంతాల్లో చేపట్టాలన్నారు. కొండపైకి వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు పాస్‌లు జారీచేయాలన్నారు. భక్తులు రవాణా కోసం తగిన సంఖ్యలో ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. తాగునీటి, మజ్జిగ కేంద్రాలు, మరుగుదొడ్లు, వైద్య కేంద్రాలు, విస్తృతంగా ఏర్పాటుచేయాలన్నారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రాత బాగ్చి మాట్లాడుతూ చందనోత్సవానికి సంబంధించి కొండపైన, దిగువన, పార్కింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలన్నారు. పార్కింగ్ కోసం అదనపు స్థలాలు కేటాయించాలన్నారు. సమావేశంలో ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యుడు విష్ణుకుమార్‌రాజు, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, డీసీపీలు అజితా వేజెండ్ల, మేరి ప్రశాంతి, డీఆర్వో భవానీ శంకర్, సింహాచలం దేవస్థానం ఇన్‌చార్జి ఈవో సుబ్బారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.