టిడ్కో... ఇటు చూస్కో!
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:44 AM
పట్టణ ప్రాంత నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం టౌన్‌షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిడ్కో) ద్వారా నిర్మించిన గృహ సముదాయాలు నిరుపయోగంగా మారుతున్నాయి.
గృహ సముదాయంలో మౌలిక వసతుల కొరత
కొమ్మాది అమరావతినగర్‌లో రోడ్డు నిర్మాణంపై అధికారుల నిర్లక్ష్యం
గృహ ప్రవేశాలకు లబ్ధిదారుల విముఖత
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
పట్టణ ప్రాంత నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం టౌన్‌షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిడ్కో) ద్వారా నిర్మించిన గృహ సముదాయాలు నిరుపయోగంగా మారుతున్నాయి.ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు లేక గృహప్రవేశాలకు లబ్ధిదారులు విముఖత చేపుతున్నారు. కొమ్మాది సమీపంలోని అమరావతినగర్ టిడ్కో ఇళ్ల దుస్థితి మరింత దారుణంగా మారింది.
టిడ్కో కింద కొమ్మాది సమీపంలోని అమరావతినగర్‌లో 384 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అందులో 184 డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లు కాగా మిగిలినవి సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు. గృహ నిర్మాణంలో భాగంగా సివిల్‌వర్క్‌తోపాటు కార్పెంటర్, ప్లంబింగ్, ఎలక్ర్టికల్ పనులు పూర్తయ్యాయి. దీంతో జీవీఎంసీ అధికారులు లాటరీ తీసి ఇళ్లను కేటాయించారు. మొత్తం 384 మందిలో 270 మందికి బ్యాంకు రుణాలు మంజూరవగా, మిగిలినవారికి సిబిల్‌స్కోర్ సరిగా లేకపోవడం, 60 ఏళ్లు దాటడం వంటి సాంకేతిక కారణాలతో పెండింగ్‌లో ఉండిపోయాయి.
ఇళ్లకు మంచి డిమాండ్
నగరానికి చేరువగా ఉండడంతో అమరావతినగర్ టిడ్కో గృహసముదాయంలోని ఫ్లాట్లకు డిమాండ్ ఏర్పడింది. కేటాయింపులు పూర్తవడంతో గృహప్రవేశాలు జరుగుతాయని అధికారులు భావించారు.అయితే అన్నిబ్లాక్‌లకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించినప్పటికీ మెయిన్‌రోడ్డు నుంచి టిడ్కో గృహసముదాయానికి వెళ్లే అర కిలోమీటరు మట్టిరోడ్డును పట్టించుకోకపోవడంతో దారి లేకుండా పోయింది. చిన్నపాటి వర్షంపడినా వాహన రాకపోకలు విషయం పక్కనపెడితే కనీసం నడిచి వెళ్లడానికి కూడా వీలులేని పరిస్థితులున్నాయని లబ్ధిదారులు అధికారుల వద్ద మొరపెట్టుకున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తిచేస్తే గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నారని జీవీఎంసీ యూసీడీ అధికారులు చెబుతున్నారు. ఈ బాధ్యత టిడ్కో అధికారులదని చెబుతుండగా, జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగమే రోడ్డు వేయాలని టిడ్కో అధికారులు వాదిస్తున్నారు.
లబ్ధిదారులపై ఈఎంఐ భారం
బ్యాంకు రణం మంజూరవడంతో నెలనెలా వాయిదాలు చెల్లించాలంటూ బ్యాంకుల నుంచి ఒత్తిడి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. గృహప్రవేశాలు చేయకపోవడంతో ప్రస్తుతం ఉన్న ఇళ్ల అద్దెకు ఈఎంఐ తోడై ఆర్థికంగా కుదేలవుతున్నామని గగ్గోలుపెడుతున్నారు. అధికారులు స్పందించి తక్షణం రోడ్డు నిర్మాణం పూర్తిచేయాలని కోరుతున్నారు.