సంక్రాంతి నాటికి టిడ్కో గృహాలు
ABN , Publish Date - Jul 18 , 2025 | 01:26 AM
పేద వర్గాల కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన టిడ్కో గృహాలను వచ్చే సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు అందజేస్తామని ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్‌కుమార్ తెలిపారు.
చైర్మన్ వేములపాటి అజయ్‌కుమార్
పెదగంట్యాడ, జూలై 17 (ఆంధ్రజ్యోతి):
పేద వర్గాల కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన టిడ్కో గృహాలను వచ్చే సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు అందజేస్తామని ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్‌కుమార్ తెలిపారు. టిడ్కో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన గురువారం తొలిసారిగా నగరానికి విచ్చేశారు. జీవీఎంసీ 65వ వార్డు భానోజీతోటలో నిర్మించిన టిడ్కో గృహ సముదాయాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో అజయ్‌కుమార్ మాట్లాడుతూ పేదల అవసరాలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. టిడ్కో గృహ నిర్మాణంలో సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు తాను ఇక్కడకు రావడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఆదేశాలతో పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, స్థానిక నాయకులు గంధం వెంకటరావు, కసిరెడ్డి సత్యనారాయణ, గడసాల అప్పారావు, తిప్పల రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కొండపోరంబోకులో పక్కా నిర్మాణం
నాలుగు నెలల క్రితం తొలగించిన అధికారులు
పునర్నించిన అక్రమార్కులు
గోపాలపట్నం, జూలై 17 (ఆంధ్రజ్యోతి):
కబ్జాదారులు బరితెగించారు. కొండపోరంబోకు స్థలాన్ని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాన్ని రెవెన్యూ అధికారులు గతంలో తొలగిస్తే...రాజకీయ నేతల దన్నుతో మళ్లీ అక్కడే పునర్నిర్మించారు.
గ్రేటర్ పరిధి 92వ వార్డు పద్మనాభ నగర్ సర్వే నంబర్ 76లోని కొండపోరంబోకు స్థలంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకరు అక్రమ నిర్మాణం చేపట్టారు. అక్రమ నిర్మాణం జరుగుతున్న విషయం తెలుసుకున్న జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు పాక్షికంగా తొలగించారు. నిర్మాణ పనులు నిలిపివేయాలని సదరు నిర్మాణదారుడిని హెచ్చరించి వెళ్లిపోయారు. అయితే కాస్త రాజకీయ పలుకుపడి ఉన్న అతను దర్జాగా మళ్లీ నిర్మాణాన్ని పూర్తిచేశాడు. దీనిపై మళ్లీ ఫిర్యాదు వెళ్లడంతో రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు ఈ ప్రాంతంలో గురువారం సర్వే చేపట్టారు. ఆర్‌ఐ కోమలి, వీఆర్వో సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జీవీఎంసీ సర్వేయర్ కుమారస్వామి, రెవెన్యూ సర్వేయర్ రాజగోపాల్ సర్వే నిర్వహించి ఈ నిర్మాణం పూర్తిగా కొండపోరంబోకు స్థలంలో ఉందని నిర్ధారించారు. అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తామని చెప్పి వెళ్లిపోయారు. రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయనే ఊహాగానాల నేపథ్యంలో ఈ నిర్మాణాన్ని తొలగిస్తారా? లేదా? అనే విషయంపై సందేహాలు వ్యక్తమౌతున్నాయి.
మెట్రో కారిడార్-1, 3లో 312 గృహాలకు నష్టం
ప్రజాభిప్రాయ సేకరణలో అధికారుల వెల్లడి
విశాఖపట్నం, జూలై 17 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో చేపట్టే మెట్రో రైలు ప్రాజెక్టు వల్ల కారిడార్-1, 3లలో సుమారు 312 గృహాలు, వ్యాపార భవనాలు పోతాయని అధికారులు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన సామాజిక ప్రభావం అంచనా (ఎన్‌ఐఏ) అధికారుల బృందం గురువారం అబిద్ నగర్ కల్యాణ మండం, ఆశీల్‌మెట్ట వేమన మందిరంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, కారిడార్-1లో 94 నివాస గృహాలు (74 ఇళ్ల ప్రహరీ గోడలు మాత్రమే పోతాయని, 20 ఇళ్లు పూర్తిగా) నష్టపోవలసి ఉంటుందని వివరించారు. కారిడార్-3లో మొత్తం 26 ఇళ్లు పోతాయన్నారు. వీటికి సంబంధించిన సలహాలు, సూచనలు ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. వాటన్నిటింనీ ఒక పుస్తకంలో నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐఏ సామాజిక, పర్యావరణ నిపుణులు మాధవరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుధాసాగర్, డిప్యూటీ తహశీల్దార్ పద్మావతి, సర్వేయర్లు, ఆర్‌ఐలు, మెట్రో రైలు ప్రాజెక్టు ఇంజనీర్ ఎన్.వసంత్, పరదేశిబాబు, లక్ష్మణ్‌లు పాల్గొన్నారు.