Share News

చీటీల నిర్వాహకుడి అరెస్టు

ABN , Publish Date - Jul 20 , 2025 | 12:59 AM

చీటీల పేరిట మోసం చేసిన నిర్వాహకుడిని ఎలమంచిలి రూరల్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ విషయం తెలిసి ఎలమంచిలి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్దకు రాత్రి మునిసిపాలిటీలోని తెరువుపల్లి వార్డుకు చెందిన చీటీల బాధితులు చేరుకున్నారు. తమను మోసం చేసిన చీటీల నిర్వాహకుడిని చూపించాలని డిమాండ్‌ చేశారు. స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. పోలీసులు సర్దిచెప్పడంతో బాధితులు శాంతించారు. దీనికి సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

చీటీల నిర్వాహకుడి అరెస్టు
ఎలమంచిలి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద బైఠాయించిన చీటీల బాధితులు

- రూ.67 లక్షల వరకు టోకరా

- పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బాధితుల బైఠాయింపు

- నిందితుడిని చూపించాలని డిమాండ్‌

ఎలమంచిలి, జూలై 19 (ఆంధ్రజ్యోతి):

చీటీల పేరిట మోసం చేసిన నిర్వాహకుడిని ఎలమంచిలి రూరల్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ విషయం తెలిసి ఎలమంచిలి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్దకు రాత్రి మునిసిపాలిటీలోని తెరువుపల్లి వార్డుకు చెందిన చీటీల బాధితులు చేరుకున్నారు. తమను మోసం చేసిన చీటీల నిర్వాహకుడిని చూపించాలని డిమాండ్‌ చేశారు. స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. పోలీసులు సర్దిచెప్పడంతో బాధితులు శాంతించారు. దీనికి సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

మునిసిపాలిటీలోని తెరువుపల్లి వార్డుకు చెందిన దాడిశెట్టి పైడియ్య ఎంతో కాలంగా చీటీలు నిర్వహిస్తున్నాడు. ఎంతో నమ్మకంగా ఉండడంతో చాలా మంది అతని వద్ద చీటీలు వేశారు. అలాగే కొందరు వడ్డీకి డబ్బులు కూడా ఇచ్చారు. అయితే గత నెల 23వ తేదీ నుంచి అతను కనిపించకపోవడంతో తాము మోసపోయామని గుర్తించి బాధితులు గత నెల 27న రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి శనివారం కొక్కిరాపల్లి జంక్షన్‌ వద్ద అతనిని అరెస్టు చేశారు ఈ విషయం తెలిసి బాధితులంతా రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. పైడియ్యను తమకు చూపించాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు కదిలేది లేదని బైఠాయించారు. వాతావరణం ఉద్రిక్తంగా మారడంతో నిందితుడిని పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. బాధితుల్లో ఐదుగురిని ఆ స్టేషన్‌కు తీసుకువెళ్లి నిందితుడిని చూపించారు. దీంతో బాధితులు శాంతించారు. దీనిపై రూరల్‌ ఎస్‌ఐ ఉపేంద్ర విలేకరులతో మాట్లాడుతూ గత నెల 27న చీటీల నిర్వాహకుడు పైడియ్యపై బాధితులు ఫిర్యాదు చేశారని, తమ విచారణలో 115 మంది బాధితులు రూ.67 లక్షల వరకు చీటీలు వేసినట్టు తేలిందన్నారు. శనివారం కొక్కిరాపల్లి జంక్షన్‌ వద్ద పైడియ్యను అరెస్టు చేశామని తెలిపారు.

Updated Date - Jul 20 , 2025 | 12:59 AM