ముగ్గురు దోపిడీ దొంగల అరెస్టు
ABN , Publish Date - Aug 04 , 2025 | 12:29 AM
బ్యాంక్ నుంచి పింఛన్ నగదు విత్‌డ్రా చేసి వెళుతున్న పెదబయలు మండలం బొండాపల్లి గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌ను కత్తులతో బెదిరించి రూ.15.62 లక్షల నగదు దోచుకున్న ముగ్గురు దోపిడీ దొంగలను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారిని అరెస్టు చేసి నగదు రికవరీ చేశారు. ఆదివారం తన కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అమిత్‌బర్ధార్ ఈ వివరాలను వెల్లడించారు.
- సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ నుంచి కాజేసిన రూ.15.62 లక్షల పింఛన్ సొమ్ము రికవరీ
- ద్విచక్ర వాహనం, మూడు సెల్‌ఫోన్లు, రెండు కత్తులు స్వాధీనం
- స్వల్ప వ్యవధిలో కేసు ఛేదించిన పోలీసులను అభినందించిన ఎస్పీ
పాడేరురూరల్, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): బ్యాంక్ నుంచి పింఛన్ నగదు విత్‌డ్రా చేసి వెళుతున్న పెదబయలు మండలం బొండాపల్లి గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌ను కత్తులతో బెదిరించి రూ.15.62 లక్షల నగదు దోచుకున్న ముగ్గురు దోపిడీ దొంగలను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారిని అరెస్టు చేసి నగదు రికవరీ చేశారు. ఆదివారం తన కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అమిత్‌బర్ధార్ ఈ వివరాలను వెల్లడించారు. పెదబయలు మండలం బొండాపల్లి సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ కటారి మత్య్సరాజు గత నెల 31న పింఛన్ల పంపిణీ కోసం పెదబయలు ఎస్‌బీఐ నుంచి రూ.15.62 లక్షలు విత్‌డ్రా చేశారు. ఆ నగదుతో బొండాపల్లి వెళుతుండగా ముంచంగిపుట్టు మండలం బంగారుమెట్ట సమీపంలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఆయన వాహనాన్ని అడ్డగించి కత్తులతో బెదిరించి నగదును అపహరించుకుపోయారు. దీనిపై బాధితుడు పెదబయలు ఎంపీడీవోతో కలిసి ముంచంగిపుట్టు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ జె.రామకృష్ణ కేసు నమోదు చేశారు. ఎస్పీ అమిత్‌బర్ధార్ ఆదేశాల మేరకు డీఎస్పీ షేక్ షెహబాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 2వ తేదీన ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు గ్రామ శివారులో ముగ్గురు వ్యక్తులు అధిక మొత్తంలో నగదును పంచుకుంటున్న సమయంలో జి.మాడుగుల సీఐ బి.శ్రీనివాసరావు, ముంచంగిపుట్టు ఎస్‌ఐ జె.రామకృష్ణ, పోలీసు సిబ్బంది వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి రూ.15.62 లక్షల నగదుతో పాటు మూడు సెల్‌ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. దోపిడీకి పాల్పడిన వారు ఒడిశా రాష్ట్రం కోరాపుట్టు జిల్లా నందపూర్ బ్లాక్ గోలూరు గ్రామానికి చెందిన సంతోశ్‌కుమార్ మహాపాత్రో, జయపూర్ బ్లాక్ బాపూజీనగర్‌కు చెందిన వికాస్ కొర్ర, జయపూర్ బ్లాక్ బలియా పంచాయతీ నేలకూడ గ్రామానికి చెందిన స్వప్నిల్ దురైగా గుర్తించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా దొంగలను పట్టుకోగలిగారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్వల్ప వ్యవధిలో కేసును ఛేదించి పూర్తి స్థాయిలో నగదును స్వాధీనం చేసుకున్న జి.మాడుగుల సీఐ బి.శ్రీనివాసరావు, ముంచంగిపుట్టు ఎస్‌ఐ జె.రామకృష్ణ, అరకు, పెదబయలు ఎస్‌ఐలు జి.గోపాలరావు, కె.రమణ, ముంచంగిపుట్టుకు చెందిన పోలీస్ కానిస్టేబుళ్లు ఎస్.రవికుమార్, ఎం.శ్రావణ్‌కుమార్, సీహెచ్ భరత్, హెచ్‌సీ కె.సంజీవ్, పెదబయలు పీసీ ఆర్.రమేశ్, హెచ్‌సీ సీహెచ్ రమణమూర్తి, అరకు పీసీలు కె.నారాయణరావు, పి.రామ్మూర్తిలను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.