Share News

ఆరు నెలల్లో మూడు హత్యలు

ABN , Publish Date - Apr 10 , 2025 | 01:13 AM

నర్సీపట్నంలో ఆరు నెలల వ్యవధిలో మూడు హత్యలు జరగడం సంచలనంగా మారింది. ఇవన్నీ మద్యం మత్తులో జరిగినవి కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత ఏడాది నవంబరు 17వ తేదీ అర్ధరాత్రి కొత్తవీధి ఎంపీపీ స్కూల్‌ సమీపంలో ప్రైవేటు ఎలక్ర్టీషియన్‌ సర్వసుద్ధి నాగేశ్వరరావు హత్యకు గురయ్యాడు.

ఆరు నెలల్లో మూడు హత్యలు
పట్ట పగలు బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న యువకులు

అన్నీ మద్యం మత్తులోనే...

విచ్చల విడిగా మద్యం బెల్టు షాపులు, ఓపెన్‌ బార్లు

పట్టణంలో అదుపు తప్పుతున్న శాంతి భద్రతలు

చోద్యం చూస్తున్న పోలీసు, ఎక్సైజ్‌ అధికారులు

నర్సీపట్నం, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నంలో ఆరు నెలల వ్యవధిలో మూడు హత్యలు జరగడం సంచలనంగా మారింది. ఇవన్నీ మద్యం మత్తులో జరిగినవి కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత ఏడాది నవంబరు 17వ తేదీ అర్ధరాత్రి కొత్తవీధి ఎంపీపీ స్కూల్‌ సమీపంలో ప్రైవేటు ఎలక్ర్టీషియన్‌ సర్వసుద్ధి నాగేశ్వరరావు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఇద్దరు నిందితులతోపాటు హత్యకు గురైన నాగేశ్వరరావు కూడా మద్యం మత్తులో ఉండడం గమనార్హం. డిసెంబరు 29 తేదీన వెంకునాయుడుపేటలో కఠారి రమణ, తన కుమారుడు భాస్కర్‌ను హత్య చేశాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించి, ఆ మత్తులో ఉండగా ఆర్థిక లావాదేవీలపై గొడవ జరిగింది. దీంతో రమణ సన్నికల్లు రాయితో భాస్కర్‌ను కొట్టి చంపేశాడు. తాజాగా అయ్యన్నకాలనీలో నూకాలమ్మ పండగలో జరిగిన గొడవ ఒక యువకుడి హత్యకు దారితీసింది.

విచ్చలవిడిగా మద్యం బెల్టు షాపులు, ఓపెన్‌ బార్లు

నర్సీపట్నంలో మద్యం బెల్టు షాపులు, ఓపెన్‌ బార్లు (బహిరంగ ప్రదేశాల్లో) అధికమయ్యాయి. పోలీసులు పట్టించుకోకపోవడంతో నానాటికీ పెరిగిపోతున్నాయి. మద్యం మత్తులో గొడవలకు దిగి కొట్టుకుంటున్నారు. అయితే వీటిపై పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదులు అందడంలేదు. కొన్నిసార్లు గొడవ ముదిరి.. హత్యకు దారితీస్తున్నది. పాకలపాడు నుంచి చీడిగుమ్మల వచ్చే దారిలో పోలవరం సమీపంలోని మద్యం దుకాణం వద్ద ఓపెన్‌ బార్‌ నడుస్తున్నది. నర్సీపట్నంలో బ్రిటీష్‌ అధికారుల సమాదులు ఉన్న అల్లూరి స్మారక ప్రదేశంలో పట్టపగలు మద్యం సేవిస్తున్నారు. నర్సీపట్నంలో ఒక వైన్‌ షాపు వద్ద కిళ్లీ బడ్డీ పెట్టించి అక్కడ మద్యం సేవించడానికి అనుమతి ఇస్తున్నారు. ఇక మద్యం బెల్టు షాపుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పోలీసులు, ఎక్సైజ్‌ శాఖల అధికారులు.. మద్యం షాపుల యజమానుల నుంచి నెలావారీ మామూళ్లు తీసుకుంటూ, బెల్టు షాపుల నిర్వాహకులు, బహిరంగంగా మద్యం సేవించే వారిపై చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా ఏజెన్సీకి ముఖద్వారం కావడంతో నర్సీపట్నంలో చాపకింద నీరులా గంజాయి విక్రయాలు, సేవించడం పెరుగుతున్నట్టు చెబుతున్నారు. నర్సీపట్నంలో గత కొంతకాలం జరుగుతున్న పరిణామాలను పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించి మద్యం బెల్టు షాపులు, ఓపెన్‌ బార్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Apr 10 , 2025 | 01:13 AM