మన్యంలో మూడు కారవాన్ పార్కులు
ABN , Publish Date - Sep 20 , 2025 | 01:20 AM
ఆంధ్రకశ్మీర్ లంబసింగిలో కారవాన్ పార్కు అభివృద్ధి చేసేందుకు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) అధికారులు చర్యలు ప్రారంభించారు. శుక్రవారం లంబసింగిలో కారవాన్ పార్కు ఏర్పాటు చేసేందుకు ఏపీటీడీసీ సీనియర్ ప్రాజెక్టు కన్సల్టెంట్ నిషిత జియోల్, అర్కెటెక్ కాలేశ్వర్, మండల స్థాయి అధికారులతో కలిసి స్థల పరిశీలన నిర్వహించారు.
మాడగడ, సుజనకోట, లంబసింగిలు ఎంపిక
ఎకరా విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఏపీటీడీసీ అధికారులు
స్థల పరిశీలన చేసిన అధికారులు
ఈ ఏడాది పర్యాటక సీజన్ నుంచే అందుబాటులోకి
స్థానిక గిరిజనులకు నిర్వహణ బాధ్యతలు
చింతపల్లి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రకశ్మీర్ లంబసింగిలో కారవాన్ పార్కు అభివృద్ధి చేసేందుకు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) అధికారులు చర్యలు ప్రారంభించారు. శుక్రవారం లంబసింగిలో కారవాన్ పార్కు ఏర్పాటు చేసేందుకు ఏపీటీడీసీ సీనియర్ ప్రాజెక్టు కన్సల్టెంట్ నిషిత జియోల్, అర్కెటెక్ కాలేశ్వర్, మండల స్థాయి అధికారులతో కలిసి స్థల పరిశీలన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఏపీటీడీసీ ద్వారా కారవాన్ టూరిజం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. జిల్లాలో కారవాన్ పార్కులు ఏర్పాటు చేసేందుకు అరకులోయ మండలం మాడగడ, ముంచంగిపుట్టు మండలం సుజనకోట, చింతపల్లి మండలంలో లంబసింగి ప్రాంతాలను ఎంపిక చేశారు. లంబసింగి ప్రాంతంలో కారవాన్ పార్కు ఏర్పాటు చేసేందుకు తాజంగిలోని సర్వే నంబరు 146లో ఎకరం స్థలాన్ని రెవెన్యూ అధికారులు కేటాయించారు. ఈ స్థలాన్ని ఏపీటీడీసీ అధికారులు పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. ఈసందర్భంగా సీనియర్ ప్రాజెక్టు కన్సల్టెంట్ నిషిత జియోల్ మాట్లాడుతూ కారవాన్ ద్వారా వచ్చే పర్యాటకులకు మంచి అతిథ్యం ఇచ్చేవిధంగా పార్కును తీర్చిదిద్దుతామన్నారు. ఈ పార్కు నిర్వహణ బాధ్యతలను స్థానికులకు అప్పగిస్తామన్నారు. కారవాన్ పార్కింగ్ చేసుకుని పర్యాటకులు ఎంజాయ్ చేసే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పార్కు వద్ద స్థానిక గిరిజనుల పండించిన వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు అనువుగా స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే స్వయం సహాయక సంఘాల సభ్యులతో అతిథిలకు ఆహారం, అల్పాహారం అందిస్తామన్నారు. కారవాన్‌లో వచ్చే పర్యాటకులు లంబసింగి ప్రకృతి అందాలను తిలకించి పార్కు వద్ద బస చేసేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈఏడాది పర్యాటక సీజన్ నాటికి కారవాన్ పార్కు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో క్యూరేటర్ శంకరరావు, ఎంపీడీవో సీహెచ్ సీతామహాలక్ష్మి, తహసీల్దార్ జి.ఆనందరావు, వీఆర్వోలు వెంగడ మానావతి, సధానందరావు, స్థానిక గిరిజనులు పాల్గొన్నారు.