ముగ్గురు ఉత్తమ టీచర్లకు విదేశీయానం
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:26 AM
ఈ ఏడాది ఉపాధ్యాయ దినోత్సవం పురస్కారాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందిన వారిని సింగపూర్ టూర్‌కు తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
27 నుంచి డిసెంబరు 2 వరకు సింగపూర్ పర్యటన
ఆనందం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు, మన్యం వాసులు
పాడేరు, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఉపాధ్యాయ దినోత్సవం పురస్కారాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందిన వారిని సింగపూర్ టూర్‌కు తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్ర స్థాయి ఉత్తమ టీచర్లుగా ఎంపికైన జిల్లాకు చెందిన ముగ్గురికి ఈ అవకాశం దక్కింది.
జిల్లాలో హుకుంపేట మండలం మత్స్యపురంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల టీచర్ మొస్య సత్యారావు, అరకులోయ మండలం కంఠబౌన్సుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్‌గా పని చేస్తున్న శెట్టి రోజారాణి, అనంతగిరి మండలం చిలకలగెడ్డ గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలలో సోషల్ టీచర్‌గా పని చేస్తున్న శెట్టి రాంబాబు ఈ ఏడాది రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఈ క్రమంలో వీరిని ఈ నెల 27 నుంచి డిసెంబరు 2 వరకు సింగపూర్ టూర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. గిరిజన ప్రాంతంలో విద్యాభివృద్ధికి కృషి చేసి, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందిన గిరిజన ఉపాధ్యాయులు సింగపూర్ పర్యటనకు వెళుతుండడంపై ఉపాధ్యాయులతో పాటు మన్యం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.