ముగ్గురు ఆశ్రమ విద్యార్థినుల పరారీ
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:49 PM
మండలంలోని రింతాడ బాలికల ఆశ్రమ పాఠశాలలో పది మంది విద్యార్థినులు అనుమతి లేకుండా చిక్కీలు తిన్నారని గదిలో మేట్రిన్ కొట్టడంతో ముగ్గురు పారిపోయారు. ఒకరోజు తరువాత ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలో విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో వారిని పట్టుకున్నారు.
చిక్కిలు తిన్నారని కొట్టిన మేట్రిన్
పాఠశాల విడిచి పారిపోయిన విద్యార్థినులు
పోలీసులకు ఫిర్యాదు చేసిన హెచ్‌ఎం, మేట్రిన్
విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో పట్టుకున్న పోలీసులు
గూడెంకొత్తవీధి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రింతాడ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న పది మంది విద్యార్థినులు అక్టోబరు 29వ తేదీన స్టోర్‌రూమ్‌లో ఉన్న చిక్కీలను తింటూ మేట్రిన్ భవానికి పట్టుబడ్డారు. దీంతో ఆమె పది మంది విద్యార్థినులను ఒక గదిలోకి తీసుకు వెళ్లి కొట్టింది. ఈ విషయం పాఠశాల మొత్తం తెలిసిపోవడంతో విద్యార్థినులు మనస్తాపానికి గురయ్యారు. వారిలో ముగ్గురు విద్యార్థినులు అక్టోబరు 30వ తేదీ ఉదయం ఏడు గంటల సమయంలో ఆధార్ కార్డులు పట్టుకుని బయటకు వచ్చేశారు. ఆ ముగ్గురు ఆర్టీసీ బస్సులో విశాఖపట్నం వెళ్లిపోయారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుమిత్ర, మేట్రిన్ భవాని ఈ విషయం బయటకు పొక్కనియ్యకుండా విద్యార్థినుల కోసం వెతకడం ప్రారంభించారు. చింతపల్లి ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి ఆదేశం మేరకు హెచ్‌ఎం, మేట్రిన్‌లు 31వ తేదీ మధ్యాహ్నం జీకేవీధి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక ఎస్‌ఐ కె.సురేశ్ ఈ విషయాన్ని చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో పోలీసులు విద్యార్థినుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అదేరోజు రాత్రి విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో విద్యార్థినులను సిటీ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు విద్యార్థినులను జీకేవీధి పోలీసులు తీసుకొని వచ్చి పాఠశాల మేట్రిన్‌కు అప్పగించారు. శనివారం చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా ఏటీడబ్ల్యూవో జయ నాగలక్ష్మితో కలిసి ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. పాఠశాల విడిచి వెళ్లిపోయిన విద్యార్థినులను ఏఎస్పీ కౌన్సెలింగ్ చేశారు.