అధిక లోడు లారీలతో రహదారికి ముప్పు
ABN , Publish Date - Aug 05 , 2025 | 01:13 AM
మాకవరపాలెం మండలంలోని పయనీర్ కంపెనీకి అధిక లోడుతో వస్తున్న భారీ వాహనాల కారణంగా కశింకోట మండలం తాళ్లపాలెం నుంచి మాకవరపాలెం మండలం రామన్నపాలెం జంక్షన్ వరకు 14 కిలోమీటర్ల మేర రహదారి దెబ్బతింటున్నట్టు ఆర్‌అండ్‌బీ అధికారులు గుర్తించారని నర్సీపట్నం ఆర్డీవో వీవీరమణ తెలిపారు.
పయనీర్ కంపెనీకి వచ్చే భారీ వాహనాలతో దెబ్బతిన్న తాళ్లపాలెం- నర్సీపట్నం రోడ్డు
నర్సీపట్నం ఆర్డీవో రమణ వెల్లడి
నివారణ చర్యలపై పలు శాఖల అధికారులతో సమావేశం
నర్సీపట్నం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి):
మాకవరపాలెం మండలంలోని పయనీర్ కంపెనీకి అధిక లోడుతో వస్తున్న భారీ వాహనాల కారణంగా కశింకోట మండలం తాళ్లపాలెం నుంచి మాకవరపాలెం మండలం రామన్నపాలెం జంక్షన్ వరకు 14 కిలోమీటర్ల మేర రహదారి దెబ్బతింటున్నట్టు ఆర్‌అండ్‌బీ అధికారులు గుర్తించారని నర్సీపట్నం ఆర్డీవో వీవీరమణ తెలిపారు. అధిక లోడుతో నడుస్తున్న లారీల కారణంగా రహదారితోపాటు తాళ్లపాలెం సమీపంలోని వంతెనకు వాటిల్లుతున్న నష్టం, నివారణ చర్యలపై సోమవారం ఆర్‌అండ్‌బీ, పోలీస్, రవాణా, లీగల్ మెట్రాలజీ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతోమాట్లాడుతూ, తాళ్లపాలెం వద్ద వంతెన పరిస్థితిపై ఆర్‌అండ్‌బీ అధికారులు తనిఖీ చేసి నివేదిక ఇవ్వాల్సి ఉందని తెలిపారు. వంతెన సామర్థ్యానికి మించి అధిక లోడుతో భారీ వాహనాలు రాకపోకలు సాగించడం వల్ల దెబ్బతింటున్నదని అన్నారు. ఇప్పుడున్న వంతెనను పటిష్ఠం చేయడమా? లేకపోతే కొత్త వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపడమా? అన్నదానిపై ఆర్‌అండ్‌బీ అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలిపారు. అధిక లోడుతో వచ్చే వాహనాలను కట్టడి చేయడానికి మాకవరపాలెం మండలం శెట్టిపాలెం సమీపంలో చెక్‌పోస్టు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్‌అండ్‌బీ డీఈ విద్యాసాగర్, లీగల్‌మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ అనురాధ, కశింకోట, మాకవరపాలెం ఎస్‌ఐలు లక్ష్మణరావు, దామోదరరావు పాల్గొన్నారు.