రావణాపల్లి ఆనకట్టకు ముప్పు
ABN , Publish Date - Nov 08 , 2025 | 12:28 AM
గొలుగొండ మండలంలోని రావణాపల్లి ఆనకట్టకు ముప్పు పొంచివుంది. ఆనకట్ట గట్టు ఏడాదిలో రెండుసార్లు కుంగింది. రిజర్వాయర్ గోడలకు రంధ్రాలు ఏర్పడి నీరు వృథాగా పోతున్నది. పొర్లుకట్టు రాళ్లు ఊడిపోతున్నాయి. ఈ పరిణామాలతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏడాదిలో రెండుసార్లు కుంగిన గట్లు
రాతి గోడకు రంధ్రాలు.. వృథాగా పోతున్న నీరు
పొర్లుకట్టుకు దిగువున ఊడిపోతున్న రాళ్లు
అధ్వానంగా మదుములు, తుప్పుపట్టిన గేట్లు
పూడికతీతకు నోచుకోని కాలువలు
నర్సీపట్నం, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): గొలుగొండ మండలంలోని రావణాపల్లి ఆనకట్టకు ముప్పు పొంచివుంది. ఆనకట్ట గట్టు ఏడాదిలో రెండుసార్లు కుంగింది. రిజర్వాయర్ గోడలకు రంధ్రాలు ఏర్పడి నీరు వృథాగా పోతున్నది. పొర్లుకట్టు రాళ్లు ఊడిపోతున్నాయి. ఈ పరిణామాలతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గొలుగొండ, నర్సీపట్నం మండలాల సరిహద్దులో రావణాపల్లి వద్ద వరహా నదిపై 1954లో ఆనకట్ట నిర్మించారు. పొర్లుకట్ల పొడవు 91.5 మీటర్లు. రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 134 ఎంసీఎఫ్‌టీలు. ప్రధాన కాలువ, కొత్తూరు బ్రాంచి కెనాల్, పిల్ల కాలువ ద్వారా రెండు మండలాల పరిధిలో 2,666 ఎకరాలకు నీరు అందుతుంది. ఆనకట్టను నిర్మించి ఏడు దశాబ్దాలు కావడంతో బలహీన పడింది. పొర్లుకట్టు దిగువన రాళ్లు జారిపోయి నీరు లీకవుతున్నది. రాతి పేర్పు, మధ్యంలో సున్నం వేసి నిర్మాణం చేశారు. కాలక్రమేణా సున్నం వదిలేసి, రాళ్ల మధ్య రంధ్రాలు పడి నీరు వృథాగా పోతున్నది. 2024లో ఎడమ గట్టు, ఇటీవల కుడి గట్టు కుంగాయి. ప్రధాన కాలువపై 17 మదుములు వుండగా వీటిలో పది మదుములు శిథిలావస్థకు చేరుకున్నాయి. మదుముల గేట్లు తప్పుపట్టి పాడయ్యాయి. కాలువలో కొంత భాగం నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలో వుంది. దీంతో ఉపాధి హామీ పథకం కింద కాలువలో పూడికతీత పనులు చేయడానికి వీలులేకపోయింది. పూడికతోపాటు తుప్పలు పెరిగిపోయాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గట్టు మరమ్మతులకు రూ.2 లక్షలు, ప్రధాన గేటు మరమ్మతులకు రూ.3.6 లక్షలు మంజూరయ్యాయి. ఆనకట్ట గోడలు, పొర్లుకట్టు, మదుముల మరమ్మతు పనులకు నిధులు మంజూరు కాలేదు. ఆయా పనులు చేయడానికి రూ.90 లక్షలు అవసరమని జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నిధులు వెంటనే మంజూరు చేసి, వచ్చే ఖరీఫ్‌లోగా పనులు పూర్తిచేయించాలని ఆయకట్టు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.