బల్క్ డ్రగ్ పార్క్‌తో ముప్పు
ABN , Publish Date - Aug 01 , 2025 | 12:33 AM
జిల్లాలోని నక్కపల్లి మండలంలో ఏర్పాటు కానున్న బల్క్ డ్రగ్ పార్క్‌పై సామాజిక పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) నివేదిక తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటైతే ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యానికి పెను ముప్పు పొంచివుందనే అభిప్రాయాన్ని ప్రజా శాస్త్రవేత్తలు, మానవ హక్కుల వేదిక, ప్రజా సంఘాల నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా శాస్త్రవేత్తలు, ప్రజా సంఘాల ఆందోళన
లోపభూయిష్టంగా ఈఐఏ నివేదిక
ఉదోగ్య, ఉపాధి కల్పన పేరుతో ప్రమాదంలోకి ప్రజల ఆరోగ్యం
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని నక్కపల్లి మండలంలో ఏర్పాటు కానున్న బల్క్ డ్రగ్ పార్క్‌పై సామాజిక పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) నివేదిక తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటైతే ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యానికి పెను ముప్పు పొంచివుందనే అభిప్రాయాన్ని ప్రజా శాస్త్రవేత్తలు, మానవ హక్కుల వేదిక, ప్రజా సంఘాల నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తున్నది. ఇటీవలే సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఏపీఐఐసీ ద్వారా భూములను బదిలీ చేయాలని నిర్ణయించారు. గతంలో ప్రతిపాదించిన మేరకు 2002 ఎకరాలను కేటాయించారు. ఈ భూముల్లో ఏపీఐఐసీ ఇప్పటికే అభివృద్ధి పనులు చేస్తున్నది. బల్క్ డ్రగ్ పార్కులో ఫార్మా కంపెనీల ఏర్పాటు ద్వారా రూ.14 వేల కోట్ల పెట్టుబడులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రత్యక్షంగా 30 వేల మందికి, పరోక్షంగా 40 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఆగస్టు 6వ తేదీన నక్కపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నేపథ్యంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుపై ఈఐఏ నివేదిక లోపభూయిష్టంగా ఉందంటూ ప్రజా శాస్త్రవేత్తలు, మానవ హక్కుల వేదిక ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పలు అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. ఫార్మా పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం గురించి నివేదికలో సహేతుకంగా లేదని, రసాయన ఉత్పత్తుల ప్రక్రియలకు సంబంధించి అసమగ్రంగా నివేదికలో పొందుపర్చారని పేర్కొన్నారు. గాలి నాణ్యతపై అంచనాలు అసత్యంగా ఉన్నాయని ఆరోపించారు. పర్యావరణ రక్షణకు కీలకంగా ఉండాల్సిన ఈఐఏ నివేదిక.. ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసినట్టుగా ఉందని విమర్శించారు. అభివృద్ధి, ఉపాఽధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేయడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
బల్క్ డ్రగ్ పార్కు వద్దు
ఎం.అప్పలరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు
ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే బల్క్ డ్రగ్ పార్క్‌ను నక్కపల్లి ప్రాంత ప్రజలు కోరుకోవడం లేదు. ఈ నెల 6న న్విహించ తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణ సభను రద్దు చేయాలి. కాకినాడ జిల్లా తొండంగి ప్రజలు వ్యతిరేకించిన బల్క్ డ్రగ్ పార్క్‌ను నక్కపల్లి మండలంలో ఎలా ఏర్పాటు చేస్తారు?