Share News

అమరావతి మహిళలను కించపరిచిన వాళ్లను కఠినంగా శిక్షించాలి

ABN , Publish Date - Jun 10 , 2025 | 01:59 AM

రాజధాని అమరావతి మహిళలను కించపరిచేలా సాక్షి చానెల్‌ డిబేట్‌లో మాట్లాడిన జర్నలిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావులను అరెస్టు చేయడమే కాకుండా చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా కేసులు నమోదు చేయాలని తెలుగు మహిళలు డిమాండ్‌ చేశారు.

అమరావతి మహిళలను కించపరిచిన వాళ్లను కఠినంగా శిక్షించాలి

తెలుగు మహిళలు డిమాండ్‌

జర్నలిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేనిలపై పోలీసులకు ఫిర్యాదులు

అనకాపల్లి టౌన్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి):

రాజధాని అమరావతి మహిళలను కించపరిచేలా సాక్షి చానెల్‌ డిబేట్‌లో మాట్లాడిన జర్నలిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావులను అరెస్టు చేయడమే కాకుండా చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా కేసులు నమోదు చేయాలని తెలుగు మహిళలు డిమాండ్‌ చేశారు. తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు ఆడారి మంజు ఆధ్వర్యంలో సాక్షి ప్రాంతీయ కార్యాలయం వద్ద, తరువాత పోలీస్‌స్టేషన్‌ ఎదుట నిరసన తెలియజేశారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లి పట్టణ సీఐ విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి, నేతలు శంకర్ల పద్మలత, పెదపాటి కల్యాణి, బత్తుల లక్ష్మి, కె.ఈశ్వరమ్మ, కె.సత్యవతి, ఎస్‌.అమరావతి, పి.తులసి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

నర్సీపట్నంలో..

నర్సీపట్నం, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): సాక్షి చానెల్‌ డిబేట్‌లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులపై చర్యలు తీసుకోవాలని మునిసిపల్‌ కౌన్సిలర్‌ చింతకాయల పద్మావతి ఆధ్వర్యంలో యర్రవరం, మాకవరపాలెం సర్పంచులు సత్యవతి, శిరీష సోమవారం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో రూరల్‌ సీఐ రేవతమ్మకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ సత్యవతి మాట్లాడుతూ, అమరావతి ప్రాంతంలో ఎక్కువ మంది దళితులు వున్నారని, వారిని కించపరిచేలా కృష్ణంరాజు మాట్లాడగా, కొమ్మినేని వంతపడారని, ఇది క్షమించారని నేరమని అన్నారు. మతాలు, సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వీరి వ్యాఖ్యానాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తాండవ చైర్మన్‌ కరక సత్యనారాయణ, జనసేన కౌన్సిలర్‌ అద్దేపల్లి సౌజన్య, టీడీపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 01:59 AM