రాజ్‌మా సాగుకు ఇదే అదును
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:17 PM
జిల్లాలో ముందస్తు రబీ పంటగా సాగు చేసే రాజ్‌మా నాట్లకు రైతులు సన్నద్ధం కావాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే ఆదివాసీ రైతులు సంప్రదాయేతర పంటగా రాజ్‌మాను సాగు చేస్తున్నారు.
ఈ నెలాఖరు నుంచి నాట్లకు అనుకూలం
90 శాతం రాయితీపై విత్తనాలు
ఐదు రోజుల్లో రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ ప్రారంభం
చింతపల్లి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ముందస్తు రబీ పంటగా సాగు చేసే రాజ్‌మా నాట్లకు రైతులు సన్నద్ధం కావాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే ఆదివాసీ రైతులు సంప్రదాయేతర పంటగా రాజ్‌మాను సాగు చేస్తున్నారు. తొలి రోజుల్లో పాడేరు, రంపచోడవరం ఐటీడీఏల పరిధిలో సుమారు 20 వేల హెక్టారుల్లో రాజ్‌మా పంటను రైతులు సాగు చేసేవారు. కాలక్రమంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు, నాణ్యమైన విత్తనం కొరత కారణంగా సాగు విస్తీర్ణం పడిపోయింది. ప్రస్తుతం పాడేరు డివిజన్ పరిధిలో 10,531 హెక్టార్లలో మాత్రమే ఆదివాసీ రైతులు రాజ్‌మా పంటను సాగుచేస్తున్నారు. రాజ్‌మాలకు అంతర్జాతీయ మార్కెట్‌లో అత్యధిక గిరాకీ వుంది. రాజ్‌మాలో పోషక విలువలు పుష్కలంగా వుండడంతో అల్లూరి జిల్లాలో పండించిన రాజ్‌మాలు 60 శాతం ఉత్తర భారతదేశానికి ఎగుమతి చేస్తున్నారు. కిలో రాజ్‌మాకు రైతులకు రూ.70 నుంచి రూ.90 ధర లభిస్తుంది. రాజ్‌మా సాగులో ఆదివాసీ రైతులు ఆధునిక శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
విత్తన రకాలు..
వ్యవసాయశాఖ ఏపీ సీడ్స్ ద్వారా చింతపల్లి రెడ్, చింతపల్లి వైట్ రకాల విత్తనాలను పంపిణీ చేస్తున్నది. చింతపల్లి రెడ్ రకం 90-95 రోజుల పంట, హెక్టారుకు 15-16 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. చింతపల్లి వైట్ 80-85 రోజుల పంట, హెక్టారుకు 12-14 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
నాట్లు, విత్తన మోతాదు..
రాజ్‌మాను ఆగస్టు నెలాఖరు నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు నాట్లు వేసుకోవచ్చు. నీటి సౌకర్యం వుంటే జనవరిలోనూ నాట్లు వేసుకోవచ్చు. ఎకరాకు 20 కిలోల విత్తనం అవసరం. విత్తనం వేయడానికి నేలను బాగా దున్ని చక్కని పదును చేసుకోవాలి. విత్తేటప్పుడు వరుసలలో 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరాన్ని పాటిస్తూ నాటుకోవాలి. రైతులకు వ్యవసాయశాఖ విత్తనశుద్ధి చేసిన విత్తనాలను అందజేస్తున్నది.
పోషక యాజమాన్యం
ఏజెన్సీ ప్రాంతంలో పశువుల గెత్తం అధికంగా లభిస్తుంది. పశువులగెత్తం అధికంగా వేసుకోవడం వల్ల రసాయన ఎరువులు తగ్గించుకోవచ్చు. ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ ఎరువులు వేసుకోవాలి. పంట పూత సమయంలో ఎకరానికి 20 కిలోల యూరియాను నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు వేసుకోవాలి.
90 శాతం రాయితీపై విత్తనాలు
ఆదివాసీ రైతులకు 90 శాతం రాయితీపై రాజ్‌మా విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నది. ఈ ఏడాది ముందుగానే రైతులకు విత్తనాలు అందించేందుకు వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేసింది. గత ఏడాది వ్యవసాయశాఖ ద్వారా పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 11 మండలాలకు 4,500 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశారు. ఈ ఏడాది 4,900 క్వింటాళ్లను రైతులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.