కొర్ర సాగుకు ఇదే అదును
ABN , Publish Date - Jul 11 , 2025 | 12:43 AM
జిల్లాలోని గిరిజన ప్రాంతం చిరుధాన్యాల సాగుకు అత్యంత అనుకూలం. ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్న క్రమంలో వీటికి డిమాండ్ పెరిగింది.
ఖరీఫ్‌లో నాట్లుకు సన్నద్ధం కావాలి
నూతన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు
చింతపల్లి, జూలై 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గిరిజన ప్రాంతం చిరుధాన్యాల సాగుకు అత్యంత అనుకూలం. ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్న క్రమంలో వీటికి డిమాండ్ పెరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో చిరుధాన్యాలు సాగుచేసే రైతులు అధిక ఆదాయం పొందవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాడేరు రెవెన్యూ డివిజన్‌లో గిరిజన రైతులు చిరుధాన్యాల పంటల్లో రాగి, సామ తరువాత కొర్ర పంటను సాగుచేస్తున్నారు. రాష్ట్రంలో కొర్ర సాగు విస్తీర్ణం 25 వేల ఎకరాలు కాగా, పాడేరు డివిజన్ పదకొండు మండలాల్లో 2,800 ఎకరాల్లో గిరిజన రైతులు సాగు చేస్తున్నారు. కొర్ర సాగులో నూతన వంగడాలను నాటుకోవడంతో పాటు శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అనువైన రకాలు: రేనాడు, ప్రసాద్, కృష్ణదేవరాయ, నర్సింహరాయ్, శ్రీలక్ష్మి, సాయి3035.
నేలలు, విత్తే కాలం: తేలిక పాటి నల్లరేగడి నేలలు, మురుగునీటి పారుదల నేలలు. ఖరీఫ్‌లో జూలై నెలాఖరు వరకు నాట్లు వేసుకోవాలి.
ఎరువులు: పశువుల గత్తం ఎరువు ఎకరానికి 2 టన్నులు వేసుకోవాలి. యూరియ ఎకరానికి 17 కిలోలు నాటిన 30 రోజుల తరువాత వేయాలి.
చీడపీడల నివారణ
చెదలు: పంటలో చెదల నివారణకు మలాథియాన్ ఎకరానికి 8 కిలోల పొడి మందును చల్లుకోవాలి.
కాండం తొలుచు పురుగు: కాండం తొలుచు పురుగు ఆశించినట్టు గుర్తిస్తే ఎండోసల్ఫాన్ ఎకరానికి లీటరు నీటిలో రెండు మిల్లీలీటర్లు కలిపి రెండుసార్లు 20-30 రోజుల మధ్యలో పిచికారీ చేయాలి.
తుప్పు తెగులు: మాంకోజెబ్ 2.5గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
అగ్గి తెగులు: కాప్టాన్‌గాని, థైరాన్‌గాని మూడు గ్రాములు కిలో విత్తనానికి కలిపి నాట్లుకు ముందు విత్తన శుద్ధి చేయాలి. పంటలో తెలుగులు ఆశించిన సమయంలో లీటరు నీటికి ఒక గ్రాము కార్బండిజమ్‌గాని, మాంకోజబ్ 2.5 గ్రాములు గాని వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.