Share News

నిత్యం ఇదేం సంత

ABN , Publish Date - Oct 05 , 2025 | 12:01 AM

అసలే తరచూ ట్రాఫిక్‌ కష్టాలు.. దీనికి తోడు అధిక సంఖ్యలో టిప్పర్ల రాకపోకలు.. ఫలితంగా గంటల తరబడి నిలిచిపోతున్న వాహనాలు.. ఇదీ డిగ్రీ కళాశాల సమీపంలోని కూరగాయల మార్కెట్‌ వద్ద పరిస్థితి. ఈ మార్గంలో ప్రయాణించే వాహనచోదకులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నిత్యం ఇదేం సంత
డిగ్రీ కళాశాల దగ్గర కూరగాయల మార్కెట్లో నిలిచిపోయిన వాహనాలు

కూరగాయల మార్కెట్‌ వద్ద తరచూ ట్రాఫిక్‌ కష్టాలు

శనివారం సంత రోజు మరీ ఇబ్బందులు

అధిక సంఖ్యలో టిప్పర్ల రాకపోకలతో అవస్థలు

నర్సీపట్నం, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): అసలే తరచూ ట్రాఫిక్‌ కష్టాలు.. దీనికి తోడు అధిక సంఖ్యలో టిప్పర్ల రాకపోకలు.. ఫలితంగా గంటల తరబడి నిలిచిపోతున్న వాహనాలు.. ఇదీ డిగ్రీ కళాశాల సమీపంలోని కూరగాయల మార్కెట్‌ వద్ద పరిస్థితి. ఈ మార్గంలో ప్రయాణించే వాహనచోదకులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కరోనా సమయంలో నర్సీపట్నం ఇందిరా మార్కెట్‌లోని కూరగాయల వ్యాపారుల్లో కొందరిని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్దకు, మరికొందరిని పెదబొడ్డేపల్లి మార్కెట్‌ కమిటీ రైతు బజార్‌ ప్రాంగణంలోకి తరలించారు. డిగ్రీ కళాశాల వద్ద రోడ్డుకు ఇరువైపులా వ్యాపారులు తాత్కాలికంగా షెడ్లు, నేల దుకాణాలు వేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. శనివారం సంత రోజు కూరగాయల మార్కెట్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఏజెన్సీకి తిరిగే బస్సులు, కూరగాయలతో వచ్చే వ్యాన్లు, ఆటోలతో పాటు భారీ టిప్పర్లు ఇసుక లోడుతో అఽదికంగా తిరుగుతుండడంతో తరచూ ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధిక సంఖ్యలో టిప్పర్లు చింతపల్లి వైపు నుంచి అబీద్‌ సెంటర్‌ మీదుగా తుని రోడ్డులోకి వెళుతున్నాయి. శనివారం ఉదయం టిప్పర్ల రాకపోకల వలన మార్కెట్లో అరగంట సేపు ట్రాఫిక్‌ నిలిచిపోయిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల మార్కెట్‌ లోంచి వాహనాలు తిరగడం వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డులో జూనియర్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, కోర్టు ప్రాంగణం ఉన్నాయి. అయ్యన్నకాలనీ, నీలంపేట, గబ్బాడ ప్రజలు నర్సీపట్నానికి రాకపోకలు సాగిస్తుంటారు. కూరగాయల మార్కెట్‌ నుంచి రాకపోకలు సాగించేటప్పుడు ట్రాఫిక్‌ సమస్యతో వీరంతా ఇబ్బందులు పడుతున్నారు.

కూరగాయల మార్కెట్‌ను ఎప్పుడు తరలిస్తారో?

కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత అధికారులు కూరగాయల మార్కెట్‌ను యథాతథంగా ఇందిరా మార్కెట్లోకి తరలిస్తారని ప్రజలు భావించారు. ఇందిరా మార్కెట్‌ వలన మండల పరిషత్‌కి సంవత్సరానికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు ఆదాయం వచ్చేది. గత నాలుగేళ్ల నుంచి ఆశీలు పాట నిర్వహించకపోవడంతో ఎంపీడీవో కార్యాలయం ఆదాయానికి గండి పడింది. రైతులు, వ్యాపారులు అక్కడ కూరగాయల మార్కెట్‌కి అలవాటు పడిపోయారు. రైతులు కూరగాయలు, అరిటి గెలలు, ఆకు కూరలు తెచ్చుకొని విక్రయించుకోవడానికి అనుకూలంగా ఉండడంతో ఇందిరా మార్కెట్‌కి రావడానికి వారు ఇష్టపడడం లేదు. అధికారులు కూడా కూరగాయల మార్కెట్‌ సమస్యను పట్టించుకోవడం మానేయడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో పట్టణ ప్రజలు కూరగాయలకు డిగ్రీ కళాశాల వరకు వెళ్లాల్సి వస్తున్నది.

Updated Date - Oct 05 , 2025 | 12:01 AM